– ఎలన్ మస్క్
న్యూయార్క్ : నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (ఎన్‌ఏటీఓ) కూటమిపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి నిష్క్రమించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు మైక్ లీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌కు మస్క్ మద్దతుపలికారు. వెంటనే అగ్రరాజ్యం నాటో, ఐక్యరాజ్య సమితి నుంచి నిష్క్రమించాలని కోరారు. ఐరోపా దేశాల రక్షణ కోసం యూఎస్ డబ్బులు చెల్లించడం ఏమాత్రం సమంజసమైన విషయం కాదని పేర్కొన్నారు.
ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ఆ దేశాల్లో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపై ట్రంప్ మాట్లాడుతూ..కూటమిలో నిర్ణయించిన విధంగా అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ జీడిపీ నుంచి తగిన మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. నాటోలోని ఇతర దేశాలు తమ వంతు నిధులను కేటాయించకపోతే తమ రక్షణ దళాలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు.కాగా రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే ఉద్దేశంతో ఈయూ దేశాలు గత వారం బ్రస్సెల్స్‌లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించాయి. తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోల (841 బిలియన్ డాలర్ల)తో ప్రణాళిక ప్రతిపాదించాయి. రక్షణ కోసం సభ్య దేశాలకు 162.5 బిలియన్ డాలర్ల రుణాలను అందించే యూరోపియన్ కమిషన్ ప్రతిపాదనపై చర్చించాయి. తాజాగా ఉక్రెయిన్ పట్ల అమెరికా తీరు ఐరోపా దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. అసలు యూఎస్ వ్యూహం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని ఈయూ రక్షణ కమిషనర్ ఆండ్రియస్ కుబిలియస్ అన్నారు.