అమెరికాలోని ప్రవాసుల సమావేశంలో కేరళ సీఎం విజయన్
న్యూయార్క్, : కేరళ ప్రగతిశీల ఆలోచనల వెలుగుగా ప్రకాశిస్తోందని, ఇక్కడ ప్రతి గొంతుకకు ప్రాముఖ్యత ఉందని, ఐక్యతా స్ఫూర్తి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆదివారం విజయన్ వందలాదిమంది ప్రవాస కేరళ సంఘం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూయార్క్‌లో ప్రవాస కేరళీయుల సదస్సు, లోక కేరళ సభ అమెరికన్ ప్రాంతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. గత ఆరేండ్లలో ప్రతి రంగంలోనూ భారీ ప్రగతి సాధించామని చెప్పారు. కేరళ ప్రగతిశీల విలువలు, సామాజిక సామరస్యం, సమానమైన వృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య వ్యవస్థ, ఇతర రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి , పెట్టుబడులు, తన పరిపాలన ద్వారా సాధించిన ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని వివరించారు. సమ్మిళిత అభివృద్ధికి కేరళ రాష్ట్రం ఒక నమూనా అని, ప్రజల కేంద్రీకృత ప్రగతికి ఉదాహరణగా అవతరించిందన్నారు. ”మా విధానాలు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పిస్తాయి . అందరికీ సమాన అవకాశాలను పెంపొందిస్తాయి” అని ముఖ్యమంత్రి అన్నారు. కేరళ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, దీని ఫలితంగా జాతీయ ఆహార భద్రత సూచికలో రాష్ట్రం ప్రధాన స్థానాన్ని సాధించిందని చెప్పారు. కేరళ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రమని, నిటి ఆయోగ్‌తో సహా అనేక ఏజెన్సీలు దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలు , ఆస్పత్రులను అత్యుత్తమమైనవిగా గుర్తించాయని విజయన్ పేర్కొన్నారు.
”మాకు అత్యుత్తమ శాంతి భద్రతలు ఉన్నాయి. మత సామరస్యం , శాంతియుత సహజీవనం ఎల్లప్పుడూ ఉండేలా చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. గత కొన్నేళ్లుగా కేరళలో ఒక్క మత హింస కూడా జరగలేదని ”ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య సీఎం చెప్పారు. ”మీ భూమిని మరింత సంపన్నం చేసేందుకు రాబోయే కాలంలో మాతో సహకరిస్తూ ఉండండి” అని ఆయన అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలకు పిలుపునిచ్చారు.