అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు

న్యూయార్క్‌ : పిడుగులతో కూడిన భారీ వర్షాలు అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశ్యాన్య ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సమాచారం ప్రకారం.. ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నాయి. దీంతోపాటు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌, లా గార్డియన్‌ ఎయిర్‌ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా.. 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. చాలా విమానయాన సంస్థలు అడ్వైజరీలను ట్విటర్‌లో పోస్టు చేశాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు.. మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్‌ చేసుకోవాలని సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి.

Spread the love