పాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పదవీకాలానికి ముందే పార్లమెంటు రద్దుకు నిర్ణయం
ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే.. పార్లమెంటును రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. ‘ఆగస్టు 12 నాటికి మా ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుంది. కానీ, అంతకుముందే అధికారం నుంచి దిగిపోతాం. ఆపద్ధర్మ ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తాం’ అని షెహబాజ్‌ పేర్కొన్నట్టు ‘డాన్‌’ వార్తాపత్రిక వెల్లడించింది. ఈ క్రమంలోనే నవంబరులో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తీవ్ర ఆర్థిక ఇక్కట్లతో సతమతం అవుతోన్న పాక్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. మిత్రపక్షమైన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) నేత ఆసిఫ్‌ అలీ జర్దారీతో భేటీ అనంతరం.. అధికారం నుంచి ముందుగానే వైదొలగాలని పీఎం షెహబాజ్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘ప్రభుత్వ పదవీకాలం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు పార్లమెంటును రద్దు చేయాలని షరీఫ్‌కు ఆసిఫ్‌ అలీ జర్దారీ సూచించారు. దీంతో నవంబర్‌లో ఎన్నికలకు వెళ్లొచ్చు’ అని పీపీపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. స్థానిక చట్టాల ప్రకారం.. జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం పూర్తయితే 60 రోజుల్లోపు ఎన్నికలు జరగాలి. అదే ముందస్తుగా రద్దయితే.. 90 రోజుల్లోపు నిర్వహించవచ్చు. ఎన్నికలకు వెనకడుగు వేస్తోన్న షెహబాజ్‌ ప్రభుత్వం.. మరింత ఆలస్యం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Spread the love