Sunday, July 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌పై అమెరికన్లలో తగ్గిన నమ్మకం

ట్రంప్‌పై అమెరికన్లలో తగ్గిన నమ్మకం

- Advertisement -


రిపబ్లికన్ల నుంచీ పూర్తి మద్దతు కరువు  ఇరాన్‌ యుద్ధం ఆయనకు రాజకీయంగా భారం

వాషింగ్టన్‌ : అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌నకు ఎదురుగాలి వీస్తోంది. అమెరికన్లలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇరాన్‌పై యుద్ధాన్ని సమర్థిస్తూ.. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుదుర్చుకున్న 2015 అణు ఒప్పందం కంటే తాను మెరుగైన ఒప్పందం తీసుకొస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్తున్నప్పటికీ.. అమెరికన్లలో ఎక్కువ మందికి ఆయనపై నమ్మకం లేదని తేలింది. వాషింగ్టన్‌ పోస్ట్‌-ఇప్సోస్‌ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రంప్‌ మెరుగైన ఒప్పందం సాధిస్తారని 23 శాతం మంది మాత్రమే భావించారు. 37 శాతం మంది ఆయన ఒప్పందం ఒబామా ఒప్పందం కంటే అధ్వానంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇరాన్‌ యుద్ధాన్ని సమర్థించడానికి ట్రంప్‌ ఒక ప్రధాన వాదనను నిరంతరం వినిపిస్తున్నారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీఓఏ) అణు ఒప్పందం పూర్తిగా విఫలమైందనీ, తాను దానికంటే ఎంతో మెరుగైన ఒప్పందాన్ని సాధిస్తానని ఆయన చెప్తున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మాత్రమే ట్రంప్‌ ఈ అంశాన్ని అనేక సార్లు ప్రస్తావించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే తాజా సర్వే ట్రంప్‌ వాదనకు భిన్నమైన ప్రజాభిప్రాయాన్ని బయటపెట్టిందని అంటున్నారు.
సర్వే ప్రకారం.. 23 శాతం మంది మాత్రమే ట్రంప్‌.. ఒబామా కంటే మెరుగైన ఇరాన్‌ ఒప్పందాన్ని కుదుర్చగలరని నమ్ముతున్నారు.
37 శాతం మంది ట్రంప్‌ ఒప్పందం మరింత చెడ్డదిగా ఉంటుందని భావిస్తున్నారు. 12 శాతం మంది రెండు ఒప్పందాలూ దాదాపు ఒకేలా ఉంటాయని చెప్పారు. మిగిలిన వారు స్పష్టమైన అభిప్రాయం వెల్లడించలేదు.
ఇరాన్‌ యుద్ధం రాజకీయ భారంగా మారిందిత
ఇంతకుముందు జరిగిన సర్వేల ప్రకారం కూడా సుమారు మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు ఈ యుద్ధం వల్ల ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా శాశ్వతంగా అడ్డుకోలేమని భావించారు.
తాజా సర్వేలో 68 శాతం మంది ఇరాన్‌ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ఇరాన్‌ వ్యవహారాల నిర్వహణపై 69 శాతం మంది అసంతృ ప్తి వ్యక్తం చేశారు. మధ్యంతర ఎన్నికలు (మిడ్‌టర్మ్‌ ఎలక్షన్స్‌) సమీపిస్తున్న వేళ ఈ అంశం ట్రంప్‌నకు రాజకీయంగా ప్రతికూలంగా మారుతోందని సీఎన్‌ఎన్‌ విశ్లేషించింది.

యుద్ధం చేసినా ఫలితంపై నమ్మకం లేదు
ఒబామా దౌత్య చర్చల ద్వారా ఒప్పందాన్ని సాధించగా.. ట్రంప్‌ మాత్రం యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన డజనుకు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బిలియన్‌ డాలర్ల మేర ఖర్చయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని స్వాధీనం చేసుకోవడంతో కొత్త సంక్షోభం ఏర్పడిందని సీఎన్‌ఎన్‌ విశ్లేషణ వివరించింది. అయినా కూడా ట్రంప్‌ చివరికి ఒబామా కంటే మెరుగైన ఒప్పందం సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో కనిపించడం లేదని పేర్కొంది.

రిపబ్లికన్లలోనూ పూర్తి మద్దతు లేదు
ట్రంప్‌ సొంత రిపబ్లికన్‌ పార్టీలో కూడా పరిస్థితి ఆయనకు పూర్తిగా అనుకూలంగా లేకపోవడం గమనార్హం. రిపబ్లికన్లలో 54 శాతం మంది మాత్రమే ట్రంప్‌ మెరుగైన ఒప్పందం చేస్తారని నమ్ముతున్నారు. అయితే ‘మాగా’ (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వర్గానికి చెందిన రిపబ్లికన్లలో ఈ మద్దతు 70 శాతంగా ఉంది. ‘మాగా’ కాని రిపబ్లికన్లలో మాత్రం అభిప్రాయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. 27 శాతం మంది ట్రంప్‌ మెరుగైన ఒప్పందం చేస్తారనీ, 23 శాతం మంది ఒబామా ఒప్పందమే మెరుగైందని భావించారు. స్వతంత్ర ఓటర్లలో 13 శాతం మంది మాత్రమే ట్రంప్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -