వైద్య రంగంలో దేశానికే ఆదర్శం

An example for the country in the field of medicine– నగర బస్తీ దవాఖానాల్లో మెరుగైన సేవలు : హౌంశాఖ మంత్రి మహమ్మూద్‌ అలీ
– గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వైద్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శం అని హౌంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఐవీఎఫ్‌ కేంద్రాన్ని హౌంమంత్రి ప్రారంభించారు. మొదటి ప్రభుత్వ ఐఏఎఫ్‌ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని హౌంమంత్రి అన్నారు. గాంధీ హాస్పిటల్‌తోపాటు వరంగల్‌ ఎంజీఎం, పేట్లబుర్జు హాస్పిటల్‌లోనూ ఐవీఎఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ ఐవీఎఫ్‌ కేంద్రం కార్పొరేట్‌ ఆస్పత్రులకు మించి సేవలు అందిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఇలాంటి గొప్ప వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. నగర డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి మాట్లాడుతూ ఐవీఎఫ్‌ అంటే ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌, సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వారికి సంతాన సాఫల్యం కలిగేందుకు ఉపయోగించే ఖరీదైన చికిత్స అని, పేదవారికి ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో గాంధీ హాస్పిటల్‌లో రూ.5కోట్లతో ఈ ఐవీఎఫ్‌ సెంటర్‌ని అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయం అన్నారు. గాంధీ హాస్పిటల్‌లో 2018 నుంచి ఐదేండ్లుగా ఐవీఎఫ్‌ (ఇంట్రా యూటేరైన్‌ ఇన్సిమినేషన్‌) సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మరింత మెరుగైన సంతాన సాఫల్యం చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా నగరంలోని గాంధీ, పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్‌, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్‌ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారాం, ఇన్‌చార్జి డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్‌తోపాటు డాక్టర్లు, బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నాయకుడు మోతె శోబాన్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love