ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
కట్టుకున్న భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. చివరికి ఆ సంబంధమే అతడి మరణానికి దారి తీసింది. ఈ సంఘటన దుబ్బాక మండలంలో కలకలం రేపింది. దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చింతల తిరుపతి (50) , వృత్తి రీత్యా వ్యాపారం చేస్తూ భార్య ఐలమ్మ కుమారులతో పాటు  కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గత కొన్నేళ్లుగా తిరుపతి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఐతే ఈ విషయం కుటుంబీకులకు తెలవడంతో కులపెద్ద మనుషుల సమక్షంలో  పంచాయితీ పెట్టి పద్దతి మానుకోవాలని కుల పెద్దలు హెచ్చరించారు. ఐనా తీరు మార్చుకొలేక  మంగళవారం వారిద్దరూ కలిసి సిద్దిపేట లోని రామచంద్రనగర్ కాలనీలో బైక్ పై తిరుగుతూ కనిపించారు. ఆ సమయంలో అక్కడ క్రికెట్ ఆడుతున్న  కుమారులు బైక్ ను ఆపేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తిరుపతితో భార్య ఐలమ్మ, కుమారులు గణేష్ , శివాజీ ఇదే విషయమై గొడవకు దిగారు.  వారీ మధ్య మాట మాట పెరగడంతో గణేష్ ఆవేశంతో ఇంటి ముందు ఉన్న సిమెంట్ ర్యాంప్ పై నుండి  తిరుపతిని బలంగా నెట్టేయగా తల వెనుక భాగంలో దెబ్బ తగిలి రక్త స్రావమైంది. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తిరుపతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు చింతల రాజలింగం తన అన్నయ్య మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  దుబ్బాక ఎస్ ఐ గంగరాజు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ దామోదర్, కానిస్టేబుల్ బిక్షపతి  ఉన్నారు.
Spread the love