బాలల బంగారు గేయాల ‘ఆనంద లహరి’

Children's Golden Songs 'Ananda Lahari'బాల సాహిత్యాకాశంలో కొత్త తారలు ఇవ్వాళ్ల తళుక్కున మెరుస్తూ కొత్త కొత్త పుస్తకాలతో… సరికొత్త ఆశలు, ఆశయాలతో తమ రచనల వెలుగులను విరజిమ్ముతున్నాయి. అనేక మంది సీనియర్‌ కవులు, రచయితలు బాల సాహిత్యాన్ని సృజించి మన పిల్లలకు తాయిలంగా అందిస్తున్నారు. ఆ కోవలో బాలల కోసం ఆనందగేయాలను అందించిన బాల గేయ లహరి, కవి, రచయిత, కార్యకర్త, హైదరాబాద్‌ సాహిత్య సభల్లో తప్పక కనిపించే సాహిత్యాభిమాని సుతారపు వెంకటనారాయణ. సుతారపు వెంకటనారాయణ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజనకారుడు, పుస్తక వికాస కార్యకర్త. వీటన్నింటికంటే కూడా దాదాపు రెండేండ్లు మణికొండ వేదకుమార్‌ సారథ్యంలో జరిగిన బాల సాహిత్యకారులు, బడి బాలల అనుసంధాన కార్యక్రమం మా ‘బాల చెలిమి ముచ్చట్లు’కు క్రమం తప్పని ప్రేక్షకుడు, అభిమాని.

ఏప్రిల్‌ 7, 1966న నేటి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెంలో సుతారపు వెంకటనారాయణ పుట్టాడు. శ్రీమతి సుతారపు రాములమ్మ-శ్రీ పిచ్చయ్య వీరి అమ్మానాన్నలు. ఎం.ఏ., బిఇడి చేసి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కవిగా ‘మనసు లిపి’ పేరుతో తొలి కవితా సంపుటిని ప్రచురించి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక పుటను లిఖించుకున్నాడు. అటు తరువాత కరోనా నేపథ్యంలో తన అనుభూతుల ఆలోచనలు, అనుభవాలను కవిత్వీకరించి ‘కరోనా కదలికలు’ పేరుతో ఒక కవితా సంపుటి ప్రచురించాడు. మరికొన్ని కవితలు మరో సంపుటికి సరిపోయేవి సుతారపు దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. బాలల పట్ల, వారి వికాసం పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనం బూదాన్‌ పోచంపల్లిలో చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి ఏర్పాటు చేసిన తొలి ‘బాల చెలిమి బాలల గ్రంథాలయం’ కోసం ముందు నిలిచి పనిచేశాడు.
ఉపాధ్యాయునిగా పాఠాలను బోధిస్తూనే కవితలు, గేయాలు, పాటలు రాయడం తన అభిమానంగా ఎంచుకున్న వీరు అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. వాటిలో లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా ‘రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2018)’, ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి ఉపాధ్యాయ పురస్కారం, తెలంగాణ జాగృతి కవి సమ్మేళన సత్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆవిర్భావ దినోత్సవ కవి సత్కారం వంటివి కొన్ని సుతారపు వెంకటనారాయణ అందుకున్న గౌరవాలు.
బాలల కోసం సుతారపు వెంకట నారాయణ రాసిన తొలి పుస్తకం ‘ఆనంద లహరి’ బాలల గేయాలు, పాటలు, కవితల సంపుటి. మరో విశేషం ఏమిటంటే ఈ మూడు రూపాల సంపుటిలో తెలుగు, ఆంగ్లం, హిందీ గేయాలు ఉండటం విశేషం కూడా! బాలలకు భక్తిని, బోధనను, ఆనందాన్ని కలిగించడం తన గేయాల అంతస్సూత్రంగా మలచుకున్న సుతారపు తొలి గేయంలో ‘భలేభలే వాడివయ్యా విఘ్నేశ/ బంగారు స్వామివయ్యా విఘ్నేశ/ … అన్ని విషయాల కన్నా విఘ్నేశ/ అమ్మానాన్నలే గొప్ప నీకు విఘ్నేశ’ అంటూ కీర్తిస్తాడు. బాలలకు అమ్మానాన్నల పట్ల ప్రేమను కలిగించడంలో యింతకన్నా చక్కని ఉదాహరణ, ఉపామానం మరొకటి ఉండదు కదా! తండ్రిని గురించి రాస్తూ ‘లౌక్యం నేర్పుతూనే/ లోకజ్ఞానం నేర్పావు’ అని చెబుతాడు. సుతారపు గేయాలు అత్యంత సుతారంగా, సున్నితంగా ఉండడానికి కారణం కవి సుతారపు వ్యక్తిత్వం. వ్యక్తిగతంగా సుతారపు వెంకటనారాయణను తెలిసిన వారికి ‘అలుగుటయే ఎరుగని’ పద్యం గుర్తుకు రాక మానదు. ఆయన రచనలు కూడా అంతే మరి! ‘నేలపై నిచ్చెనలేస్తాం/ నింగికి దారులు కనుగొంటాం/ నవ్వుతూ మేము పయనిస్తాం/ నక్షత్రాలతో ఆటలాడేస్తాం’ అంటూ బాలల గురించి అందంగా ఒక చోట చెబితే, మరొకచోట ఆ బాలలే బాల కార్మికులుగా కనిపిస్తే వారి ఆలోచనలు ఎలాగుంటాయో ఇలా రాస్తాడు… ‘విద్యను మాకందిస్తే/ విజ్ఞాన లోకాన సాగుతం/ చదువే మాకు ఆయుధం/ సంస్కారమే మాకు సహకారం’.
ఇంకా పిల్లలు ఎలాంటి వారట అంటే… ‘కల్మషాలు మేమెరుగం/ కష్టాలు అసలే కోరం/ దానవత మాకొద్దు/ మానవతే మాకు ముద్దు’ అంటూనే ‘ప్రకృతి అంటే మాకిష్టం/ మంచిని పెంచుటే మాకిష్టం/ పరిసరాలంటే మాకిష్టం/ ప్రాణ జీవులు మాకిష్టం’ అంటారు. ఇంకా తన గేయాల్లో నెహ్రూ మొదలుకుని కోకిల, చిలుక, నెమలి, కుందేలు యిలా అనేక ప్రాణులు పాటలై, గేయాలై నర్తించడం చూడవచ్చు. కవి సుతారపుది బూదాన్‌ పోచంపల్లితో పెనవేసుకున్న బంధం. ఆ బంధాన్ని కూడా బాలల కోసం చక్కని గేయంగా మలిచాడు. చక్కని అంశాలు విషయాలతో సాగిన ‘ఆనంద లహరి’లో బాలలకు ఆనందంతో పాటు ఆశయాలు ఉండాలని చాటిన సుతారపు వెంకట నారాయణ బాలలకు జామకాయలు, జారుడు బల్లలే కాదు, వీటితో పాటు చక్కని జీవన లక్ష్యం ఉండాలని చెబుతాడు. యివ్వాళ్ల ఈ బాలల కవి యాభయ్యెనిమిదవ పుట్టిన రోజు! పిల్లలూ! మన నేస్తం.. మన బాల గేయాల కవికి మీ అందరి తరపున పుట్టిన రోజు జేజేలు!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love