అరాచకం, అవినీతిలేని ఖమ్మం కోసం కదంతొక్కాలి

– ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
అరాచకం, అవినీతిలేని ఖమ్మం కోసం మహిళలు కదం తొక్కాలని, ప్రస్తుతం ఖమ్మంలో పోలీస్‌ రాజ్యం నడుస్తుందని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. బుధ వారం ఖమ్మంలోని 5వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత డివిజన్‌ నాయకులు తమ్మినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
వికలాంగులకు, ఎస్సీలకు
ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
వికలాంగులకు, ఎస్సీలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు తుంపాల కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో వికలాం గులు, ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
తుమ్మల నామినేషన్‌ దాఖలు
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు తరఫున కాంగ్రెస్‌ నేతలు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు ‘బి’ ఫామ్‌ సైతం సమర్పించారు. ఖమ్మం నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జావేద్‌, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ ‘ఏ’ బ్లాక్‌ అధ్యక్షుడు యర్రం బాలగంగాధర్‌ తిలక్‌, పిఎసిఎస్‌ ప్రెసిడెంట్‌ ఎలగొండ స్వామి, న్యాయవాది రత్నాకర్‌రావు, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి తుమ్మల తరఫున నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.
వంద కుటుంబాలు చేరిక
రఘునాథపాలెం మండలంలోని గ్రామాలలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రోడ్లు, తాగునీరు డ్రైనేజీ వ్యవస్థకి శంకుస్థాపన చేసి నిర్మింపజేసిన ఘనత మాదేనని మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్‌ గాజుల నీలిమ, గాజుల రమేష్‌, చింతగుర్తి గ్రామ ఎంపీటీసీ మళ్ళొత్‌ లక్ష్మి , మళ్ళొత్‌ వెంకన్న, బిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు, భూక్య వెంకన్న, వార్డు నెంబర్‌ బాదావత్‌ కృష్ణ, రెండు గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు బిఆర్‌ఎస్‌ పార్టీని వీడి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Spread the love