అటు ఎన్నికల హోరు…ఇటు రక్షణ భేరీలు

And the chorus of elections...and the defensesమరో ఇరవై రోజులలోపే తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది, శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నవంబరు 30న ఓటేయడానికి ప్రజలు సంసిద్ధులవుతుండగా రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. క్రమేణా రూపు మారుతున్న ప్రచార పద్ధతులూ, మీడియా సోషల్‌ మీడియా సాధనాలు, నాయకుల పర్యటనలూ అన్నీ అదే దిశలో హోరెత్తుతున్నాయి. ప్రజల తీర్పు ఎలా వుంటుందనే దానిపై అనేక రకాల సర్వేలు వెలువడుతున్నా ఇవేవీ ప్రభంజనం వస్తుందని చెప్పడం లేదు. పాలకపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పగా కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుందని రెండు మూడు సర్వేలు చెప్పాయి. అయితే విషయమేమంటే అసలు సర్వేలపై విశ్వసనీయత బాగా తగ్గడం. టీవీ చర్చలలో ఆయా పార్టీల నాయకులు తమ ఓటమిని సూచించిన సర్వేలను తోసిపారేయడమే గాక ఎదురుదాడి చేస్తున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చిన స్పాన్సర్డ్‌ సర్వే సంస్థల మాటకు విలువే వుండబోదని తెలంగాణ పరిస్థితిని బట్టి స్పష్టమవుతున్నది. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ అనేదానిపై మాత్రం ఏకాభిప్రాయం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ ప్రభంజనం నెలకొందన్న కథనాలతో అతివిశ్వాసం పాలైన ఆ పార్టీ ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో చివరి వరకూ చర్చల ప్రహసనం జరిపి తాము అనుకున్నట్టు జరిపించడానికి పాచికలు విసిరింది.దానికీ కావలసినంత వ్యవధి ఇచ్చిన తర్వాత సీపీఐ(ఎం) గట్టి వైఖరి తీసుకోవడంతో కాంగ్రెస్‌ ఎత్తుపారలేదు, సీపీఐకి ఒక స్థానం కేటాయించినా అక్కడ కూడా ఆ పార్టీకి ఏ మేరకు సహకరిస్తుందనేది ఎవరికీ నమ్మకం లేని విషయం, ఎందుకంటే మా వాళ్లు మీకు సీటిచ్చినా ఓటు వేయరని కాంగ్రెస్‌ నాయకులు బాహాటంగానే కమ్యూనిస్టు నేతలకు చెప్పేశారు. విధానపరమైన విజ్ఞత అటుంచి అవగాహనను అమలు చేసే ఆనవాయితీ లేదని వారే ఒప్పుకుంటున్నారంటే ఇక ఇతరులు ఎలా నమ్మడం? అసలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌, బీజేపీలలో ఎవరువుంటారో ఏ క్షణంలో మరోచోటికి దూకేస్తారో అర్థం గాని అయోమయావస్థ. తెలంగాణలో రాజకీయ మార్పునకు సంకేతమై నిలిచిన మునుగోడులోనే ఇదివరకు కాంగ్రెస్‌నుంచి దూకి బీజేపీ తరపున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇప్పుడు మళ్లీ పాతపార్టీ లోదూకి ఇటు నుంచి చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో టికెట్‌ రానివారందరూ అటోఇటో దూకేస్తున్నారు. కొత్తగా టికెట్టివ్వడానికి పెద్ద అవకాశం లేని బీఆర్‌ఎస్‌ కూడా ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను ఆఖరి క్షణంలో చేర్చుకోవడం నిత్యకృత్యమైంది. ఎన్నికల తరుణంలో ఇవన్నీ గతం లోనూ జరిగాయి గాని ఇప్పుడు ఆ మోతాదు చాలా ఎక్కువగా వుంది. ప్రజాస్వామ్య లౌకిక విలువల పట్ల విధానపరమైన నిబద్దత, రాజకీయ విలువలు లేకపోవడం వల్ల ఎన్నికల పోరాటం కాస్త అధికారం కోసం ఆరాటంగానే తయారైంది.
సందేహాస్పద రాజకీయం
బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో బీఆర్‌ఎస్‌ ఒకకీలక భాగస్వామి అవుతుందనే నమ్మకం మునుగోడు ఎన్నిక కలిగించింది. ఆ సమయంలోనే ఆపరేషన్‌ ఫాంహౌస్‌, లిక్కర్‌ స్కాం కేసు వంటివి రంగం మీదకు వచ్చాయి.బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కెేసీఆర్‌ కుటుంబంపైనా తీవ్రస్థాయిలో దాడి చేశారు. వారి బెదిరింపులూ మతోన్మాద భాషణలూ పరాకాష్ట నందుకున్నాయి.తర్వాత రకరకాల కథనాల మధ్య ఈ వాతావరణం మారిపోయింది. కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ‘ఇండియా’, బీజేపీల మధ్య సమదూరం సిద్ధాంతం ఆలపించసాగారు. కాంగ్రెస్‌ మా ప్రధాన ప్రత్యర్థి గనక ఇలా అంటున్నామని పైకి చెబుతున్నా మోడీ నిరంకుశపోకడలపౖౖె విమర్శ ఎందుకు తగ్గిందనేది ప్రశ్న. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ మూలాలున్న వారి ఓట్ల ప్రభావం, కులపరమైన లెక్కలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనూ బీఆర్‌ఎస్‌ ఓట్లను కాపాడుకోవడం కోసం అనేక విధాల వ్యూహాలు మాటలు మార్చలేక తంటాల్థు పడుతోంది. కేసీఆర్‌ దాదాపు బీజేపీ ప్రస్తావనే చేయడం లేదు. కేటీఆర్‌ అప్పుడప్పుడూ బీజేపీపైనా విమర్శలు వినిపిస్తూ వారితో తమకు ఎప్పుడూ ఎలాటి బంధం లేదంటున్నా బీఆర్‌ఎస్‌పై ఆ విధమైన సందేహాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు మాత్రం పాలకపార్టీపై దాడి తీవ్రంగానే సాగిస్తున్నా కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా చేయడమే వారికి కీలకమని పరిశీలకులు స్పష్టంగానే గుర్తిస్తున్నారు.వారి ఎత్తుగడలు ఏమైనా అసలు కాంగ్రెస్‌ శిబిరంలోనే ఐక్యత లేకపోవడం, అనేక మంది ముఖ్యమంత్రులు ముందుకు రావడం షరామామూలుగా సాగుతున్నది. మరోవంక మజ్లిస్‌ నేత ఒవైసీ బీఆర్‌ఎస్‌కే తమ మద్దతు వుంటుందని ప్రకటిస్తున్నారు.హంగ్‌ మాటలు కూడా వచ్చినపుడు మజ్లిస్‌ మద్దతు అవసరం కావచ్చనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.అయితే అలాంటి పరిస్థితి వస్తే అప్పటి అవకాశాలను బట్టి ఆయా పార్టీలు వ్యవహరిస్తాయి తప్ప చెప్పిన దానికే కట్టుబడి వుంటాయనుకోవడం పొరబాటు. బీజేపీతో చేతులు కలిపి జనసేన పవన్‌కళ్యాణ్‌ కూడా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండడం, బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకోవడం ఇక్కడ విస్మరించరాని విషయం. బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయ పాత్ర నిర్వహిస్తామని హడావుడి చేసిన కేసీఆర్‌ ఇటీవల ప్రాంతీయపార్టీలే కీలకమని వ్యాఖ్యానిం చడం కూడా బీజేపీకి రాజకీయ సంకేతం కోసమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్‌ను బల పరుస్తూ షర్మిల వైఎస్‌ఆర్‌టిపి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ టీజేఎస్‌ కూడా పోటీ నుంచి తప్పుకోవడం, గతంలో పాలక పార్టీగా వున్న తెలుగుదేశం ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం కూడా ఈ రాజకీయ విన్యాసాలలో భాగమే.
సీపీఐ(ఎం) విస్పష్ట వైఖరి
ఇంత విశృంఖలంగాా తయారైన రాజకీయ నేపథ్యంలో సీపీఐ(ఎం) బీజేపీని ఓడించ డానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానా లపై పోరాడటానికి స్వంతంగా పోటీ చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలలోనూ ఇతర చోట్ల కూడా నామినేషన్లు దాఖలు చేసిన ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. కీలక నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మొదట బీఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌ వామపక్షాలతో పొత్తు సంకేతాలిచ్చి తర్వాత ప్లేటు మార్చడం బీజేపీ మతతత్వంపై పోరాటానికి హానికలిగించిన తీరును వారు నిశితంగా విమర్శిస్తున్నారు. ఒక విధంగా మూడు శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుంటూ ఆత్మగౌరవం విధాన స్పష్టతతో ముందుకు పోవడం సీపీఐ పోటీచేసే కొత్తగూడెంలో వారికే మద్దతు నిస్తామని కూడా సీపీఐ(ఎం) చెప్పడం లౌకిక శక్తుల, వామపక్ష వాదుల మన్నన పొందుతున్నది. ఈ పరిస్థితికి కారణమైన బీఆర్‌ఎస,్‌ కాంగ్రెస్‌లు ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి రావచ్చు. గతవారం ఇదే శీర్షికలో చెప్పుకున్నట్టు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌ ఇలాటి పరిస్థితికి కారణం కావడం గమనించదగ్గది.ఇక బీఆర్‌ఎస్‌, బీజేపీ సంబంధాలు ఎలా వుండేది భవిష్యత్తు చెబుతుంది గానీ ఇప్పటికైతే బీజేపీపౖౖె విమర్శ తగ్గిందనేది నిర్వివాదాంశం. ఎంఎల్‌సి కవితను అరెస్టు చేయకపోవడానికి ఇదే కారణమని కాంగ్రెస్‌ ఆరోపించడమే గాక కెేసీఆర్‌ సర్కారుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కూడా అడపాదడపా అంటున్నది. వాస్తవానికి భిన్నంగా ఏదో బీఆర్‌ఎస్‌ కోసం స్వంతంగా పోటీచేస్తున్నదని వచ్చిన ఆరోపణలను సీపీఐ(ఎం) నిశితంగా ఖండించింది. బీజేపీని ఓడించడమే గాక స్వంత పునాదిని కాపాడుకోవడం కూడా ఒక కీలక కర్తవ్యమని కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీట్‌దప్రెస్‌లో గుర్తుచేశారు. పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులుతో సహా సీపీఐ(ఎం) నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ తమ పోటీ ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
ఏపీిలో ప్రజారక్షణభేరి
ఇదే సమయంలో ఏపీలో ఎన్నికలు లేకున్నా రాజకీయ వివాదాలు, కేసులు తీవ్రంగానే నడుస్తున్నాయి. పాలక వైసీపీ, టీడీపీలు నిరంతరం ఈ తగాదాలలోనే మునిగితేలుతూ నిజమైన సమస్యలను కేంద్రం చేసిన అన్యాయాలను గాలికొదిలేస్తున్నాయి. బీజేపీ ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా వున్న జనసేన ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు ప్రకటించింది. ఆ రెండు పార్టీల మధ్య రెండు దఫాలు చర్చలు జరిగాయి గాని సమస్యలపై కార్యాచరణ మాత్రం మొదలైంది లేదు. మరోవంక వైసీపీ సామాజిక సాధికార యాత్రల తతంగం మొదలెట్టింది. తామే సామాజిక న్యాయానికి ప్రతిరూపమని పథకాల గురించి చెప్పుకుంటున్నది. నిజానికి ఈసామాజిక సాధికారత నేతిబీరకాయలో నెయ్యిలాంటిదని సీపీఐ(ఎం) నాయకులు నిశితంగా విమర్శ చేస్తున్నారు. దళితులు, గిరిజనులు వెనకబడిన వర్గాలు మహిళల రక్షణలో వైఫల్యాన్ని తాజా ఘటనలతో సహా వారు ప్రజలముందు ప్రస్తావించారు. రైతులు ఉద్యోగులు కార్మికులు నిరుద్యోగుల సమస్యలను ఎలుగెత్తిచాటారు. పోలవరం నిర్వాసితుల సమస్యలనూ రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల వెతలను వినిపించారు. ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణయత్నాలపై పోరాడకుండా మోడీ ఆదేశాల మేరకు అదానీకి వనరుల ధారదత్తం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. బీజేపీ పట్ల టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కేంద్రం వివక్షనూ, దీర్ఘకాలిక సమస్యలను మౌలికాంశాలను పక్కకు నెట్టి పరస్పర వివాదాలకే పరిమితమై మోడీకి మూడు ప్రాంతీయ పార్టీలూ బీజేపీతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నాయని సీపీఐ(ఎం) కార్యదర్శి శ్రీనివాసరావు సూటిగానే చెప్పారు. ఒక్క విషయంలోనైనా బీజేపీ మతతత్వాన్ని, కేంద్ర నిరంకుశత్వాన్ని ప్రశ్నించడానికి ఈ పార్టీలేవీ సిద్ధం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాపితంగా నిర్వహించిన ప్రజారక్షణ భేరి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రత్యా మ్నాయ రాజకీయ భావనను పోరాట సందేశాన్ని ప్రజల ముందుంచింది. ఎక్కడికక్కడ ప్రజలు వామపక్ష వాదులు సమాదరించడం ఒక చర్చకు ప్రారంభవాక్యమైంది, వివిధ ప్రాంతాల నుంచి మొదలైన ఈ యాత్రలు ముగింపుగా విజయవాడకు చేరుకుంటున్నాయి. నవంబరు 15న జరిగే పెద్ద బహిరంగ సభ ప్రదర్శనలు ఈ యాత్రలకే గాక రాష్ట్రంలో ఒక భిన్నమైన రాజకీయ చర్చకు పున:సమీకరణకూ నాంది పలికితే అది శుభసూచకమవుతుంది. సీపీఐ(ఎం) రెండు రాష్ట్రాలలోనూ ఆయా పార్టీల అవకాశవాద పోకడలకు భిన్నంగా ఎన్నికలలోనూ ఉద్యమాలలోనూ సీపీఐ(ఎం) విలక్షణ పంథా అనుసరించడం అభినందనీయం. ప్రజలు ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని, అన్ని వామపక్ష ప్రజాస్వామిక శక్తులు సామాజిక తరగతులూ తోడవుతుతారని ఆశించాలి.
తెలకపల్లి రవి 

Spread the love