మిషన్‌ భగీరథ సర్వే నుంచి..అంగన్వాడీ టీచర్స్‌ని మినహాయించాలి

మిషన్‌ భగీరథ సర్వే నుంచి..అంగన్వాడీ టీచర్స్‌ని మినహాయించాలి– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి
నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్‌
మిషన్‌ భగీరథ సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మిషన్‌ భగీరథ సర్వేను అంగన్వాడీ టీచర్లు చేయాలని అధికారులు సూచించి నప్పటికీ ట్రైనింగ్‌ సమయంలోనే అధికారుల దృష్టికి యూనియన్‌ తరపున ఇది చేయలేమని తేల్చి చెప్పారన్నారు. అయినా తప్పనిసరిగా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, దీన్ని విరమించుకోవాలని సూచించారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు అనేక యాప్‌ల ద్వారా వివిధ సర్వేలు చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ తట్టుకొని వారి అదనపు పనులను నిర్వర్తిస్తున్నారని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో శిశువుల నుంచి ఐదేండ్ల పిల్లల వరకు వారి సంరక్షణతో పాటు పోషక పదార్థాలు అందించడం, గర్భవతులకు పోషక పదార్థాలు అందించడం లాంటి విధులు అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో అంగన్వాడీ టీచర్లను మరోమారు మిషన్‌ భగీరథ సర్వేలు చేయాలని ఒత్తిడి చేయడంతో వాళ్ల విధులకు ఆటంకం కలుగుతుంద న్నారు. అధికారులు ఒత్తిడి చేస్తే సహించబోమని, ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్‌, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్‌, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. పద్మ, జిల్లా అధ్యక్షులు లక్ష్మీ, కోశాధికారి పద్మ, నాయకులు ఎడ్ల లక్ష్మీ, వసంత, అనిత, శ్యామల, శబరి, సురేఖ, భూలక్ష్మి, ప్రేమలత, కళావతి, టీచర్లు పాల్గొన్నారు.

Spread the love