Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

- Advertisement -

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి మరో ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో హోటల్‌ అగ్నిప్రమాద ఘటన మరవకముందే మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆగ్నేయ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరో పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున 2.31 గంటల సమయంలో గోవింద్‌‌పురి పోలీస్‌ ‌స్టేషన్‌‌కి సమాచారం అందడంతో సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రా లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టెర్రస్‌ ‌గేటను పగలగొట్టి అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది మందిని కాపాడారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌‌ పార్కింగ్‌ ఏరియాలో ఉన్న ఎలక్ట్రిక్‌ ‌స్కూటర్‌కి ‌ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో షార్ట్‌ ‌సర్క్యూట్‌ ‌వల్ల ఆ స్కూటర్‌ ‌పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఆ మంటలు పక్కనున్న వాహనాలకి అంటుకుని మూడు స్కూటర్లు, రెండు మోటార్‌‌ సైకిళ్లు, ఓ సైకిల్‌ అగ్నికి ఆహుతయ్యాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు డిఎఫ్‌ఎస్‌ అధికారులు వెల్లడించారు. భవనాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో పలువురు నివాసితులు లోపల చిక్కుకుపోయారని, అప్పటికే ముగ్గురు చనిపోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) హేమంత్ తివారీ తెలిపారు. భవనంలో ఉన్న ఇద్దరు బాలికలు సహా 8 మందిని రక్షించి, చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి, ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. మృతులను పంకజ్ (28), ఆయన తల్లి గుడ్డి (50), ఆయన సోదరి సోని (20)గా గుర్తించామన్నారు. వీరందరూ ఆ భవనంలోని మూడవ అంతస్తులో నివసి స్తున్నారని చెప్పారు. కాగా ఇదే ఘటనలో పంకజ్ కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులు ఆయన మరో సోదరి మోని (18), ఆయన అమ్మమ్మ (70) తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. కాగా దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఒక బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి కనీసం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -