Saturday, June 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినేరమెవరిది? శిక్ష‍ెవరికి?

నేరమెవరిది? శిక్ష‍ెవరికి?

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యత. కానీ ప్రశ్నించిన వారినే నేరస్తులుగా చిత్రీకరించడం, ఏండ్ల తరబడి జైళ్లలో ఉంచడం, కోర్టుల చుట్టూ తిప్పడం నేటి పాలనావ్యవస్థ దుర్మార్గ స్వరూపం. పెట్టిన కేసులు, చేసిన ఆరోపణలు నిరూపించకపోతే? మరి ఆ నేరం ఎవరిది? విదేశీ నిధుల ద్వారా చైనా అనుకూల ప్రచారం చేశారంటూ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఈ.డి. నమోదు చేసిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ‘‘ఈ కేసును కొనసాగించడమంటే చట్టాలను దుర్వినియోగం చేయడమేనంటూ’’ వ్యాఖ్యానించింది. పైగా కేసు విచారణలో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధానాలను పాటించలేదని, అరెస్టు ప్రక్రియలోనే తీవ్ర లోపాలున్నాయని గుర్తించింది. చట్టం నిర్దేశించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకున్నం దున అరెస్టు చెల్లదని తేల్చిచెప్పింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి జరిగిన న్యాయంగా చూడటంకంటే, పతన మవుతున్న ప్రజాస్వామ్య విలువలకు లభించిన ఊరటగా చూడాలి. అంతేకాదు, నేరం నిరూపించలేని కేంద్రానికి ఇదో చెంపపెట్టుగానే భావించాలి.

ఇంతకు ప్రబీర్‌ ‌పురకాయస్థ చేసిన నేరమేంటి? న్యూస్‌‌క్లిక్‌ అనే వెబ్‌‌ పోర్టల్‌ ‌ద్వారా ప్రజాజర్నలిజంతో అనేక సమస్యల్ని వెలుగులోకి తెచ్చాడు. 2020-21లో వ్యవసాయ నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్రంపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన మహోద్యమానికి మద్దతుగా అనేక కథనాలు రాశాడు. ప్రభుత్వ విధానాల్ని, కార్పొరేట్‌ ‌శక్తుల పన్నాగాల్ని సమాజం ముందుం చాడు. నిరుద్యోగం, ప్రజారోగ్యం, విద్యా రంగం, ఆర్థిక అసమానతల వంటి లోపాల్ని ఎండగట్టాడు. ప్రధాన మీడియాను మోడి యాగా మార్చుకున్న కేంద్రం ఈ కథనాల్ని జీర్ణించుకోలేకపోయింది. వారి కనుసన్నల్లోని ఈడిని పురమాయించింది. 2023లో అమెరికా పత్రిక ప్రచు రించిన ఆధారాలు లేని ఒక కథనాన్ని నెపంగా తీసుకుని చైనా నిధులతో వెబ్‌‌సైట్‌ ‌నిర్వహిస్తున్నారని న్యూస్‌‌క్లిక్‌ ‌కార్యాలయంపై దాడులు చేసింది, అనేక పైళ్లను స్వాధీనం చేసుకుంది. ప్రబీర్‌తో పాటు, మరో ఉద్యోగి అమిత్‌ ‌చక్రవర్తిపై ఉపా కేసు ప్రయోగించింది. ఈ కేసు 2024లోనే చట్ట విరుద్ధ మని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆ కేసునే కొట్టిపారేసింది. అయితే, ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న? చివరకు కేసు నిలబడకపోతే, ఆ వ్యక్తి గడిపిన జైలు జీవితం, కోల్పోయిన స్వేచ్ఛ, మానసిక వేదనకు బాధ్యత ఎవరిది? విచారణ పేరుతో సాగిన వేధింపుల పర్వం స్వతహాగా ఒక శిక్ష‍ కిందకే వస్తుంది.

న్యాయస్థానం చివరకు విముక్తి ఇచ్చినా, కోల్పోయిన కాలాన్ని తిరిగి ఇవ్వలేదు కదా. ప్రబీర్ పుర్కాయస్థ విషయమే చూడండి. 2023 అక్టోబర్‌లో ఆయన్ను ఈడి అరెస్టు చేసింది. మూడేండ్ల పాటు విచారణ, ఏడు నెలలు జైల్లో నిర్భంధించింది. కేసు రుజువుకాక ముందే వ్యక్తిని సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసింది. ప్రబీర్ పుర్కాయస్థ ఈ సమస్య ఒక్కరిదే కాదు, దేశవ్యాప్తంగా వందలాది మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థి నాయకులు ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయి బాబా కేసు అందుకు విషాదకర ఉదాహరణ. మావోయిస్టులకు సహకరిస్తు న్నాడనే నెపంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దాన్ని నిరూపించలేక పోయారు. తొంభై శాతం శారీరక వైకల్యంతో వీల్‌‌చైర్‌‌కే పరిమితమైన వ్యక్తి దాదాపు తొమ్మిదేండ్ల పాటు జైలుగోడల మధ్యే గడిపాడు. బాంబే హైకోర్టు నాగ్‌‌పూర్‌ ‌బెంచ్‌ నిర్దోషిగా ప్రకటించినప్పటికీ విడుదలైన కొద్దిరోజులకే ఆయన చనిపోయాడు. కవి వరవరరావుదీ అదే పరిస్థితి. వృద్ధాప్యంతో బాధపడుతూ భీమా కోరేగవ్‌ ‌కేసులో జైలు జీవితం గడిపాడు. చివరకు బెయిల్‌ ‌మంజూరైనా ముంబాయి వదిలి వెళ్లకూడదని కోర్టు ఆంక్ష‍లు విధించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ‌ఖలీద్‌ ఏండ్లకొద్దీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సిద్దిఖీ కప్పన్‌, మహ్మద్‌ ‌జుబైర్‌ ‌వంటి జర్న లిస్టులు, ఇంకా ఎందరో మానవ హక్కుల, సామాజిక కార్యకర్తలు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 19(1) (ఎ) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. పత్రికా స్వేచ్ఛ కూడా అదే సూత్రం నుంచి ఉద్భవించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు. విధానాన్ని విమర్శించడం దేశ వ్యతిరేకత కాదు. భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి శత్రువు కానేకాదు, మీడియా సంస్థలు అధికారానికి ప్రశంసలు మాత్రమే చేయాలని, అసౌకర్యకర ప్రశ్నలు అడగకూడదని ఆశిస్తే అది ప్రజా స్వామ్యం అనిపించుకోదు. ఈ పరిణామాలన్నింటిలో కనిపించే నమూనా ఒక్కటే. ముందుగా తీవ్రమైన ఆరోపణలు, తర్వాత కఠిన చట్టాల ప్రయోగం, ఆపై దీర్ఘకాల నిర్బంధం. కానీ విచారణ ముగిసేసరికి ఆరోపణలు నిలబడక పోవడం లేదా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం. ఇది ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ప్రమాదకర ధోరణి. దీన్ని నిలదీయాలి. నేడు ఒక జర్నలిస్టుపై జరుగుతున్న అన్యాయం, రేపు సాధారణ పౌరుడి తలుపు తట్టే ప్రమాదం లేకపోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కేవలం కోర్టులదే కాదు, పౌర సమాజానిది కూడా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -