Wednesday, June 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉత్తర ఐర్లాండ్‌లో ఇమ్మిగ్రేషన్‌ వ్యతిరేక హింస

ఉత్తర ఐర్లాండ్‌లో ఇమ్మిగ్రేషన్‌ వ్యతిరేక హింస

- Advertisement -

బెల్‌ఫాస్ట్‌ : వారం రోజుల వ్యవధిలోనే బ్రిటన్‌లో రెండోసారి ఇమ్మిగ్రేషన్‌ వ్యతిరేక హింస చెలరేగింది. ఆశ్రయం కోరుతున్న సూడాన్‌ దేశస్థుడు ఉత్తర ఐర్లాండ్‌ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో ఆగ్రహించిన ప్రజలు ఇమ్మిగ్రేషన్‌ వ్యతిరేక ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసకు దారితీసింది. మంగళవారం రాత్రి ముసుగులు ధరించిన దుండగులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వారిని ఇళ్ల నుంచి బయటికి తరిమేశారు. ఆ తర్వాత జనావాసాలకు నిప్పు పెట్టారు. అనేక వాహనాలను కూడా తగలబెట్టారు. సీసాలు, కర్రలు చేత పట్టుకొని భయానక వాతావరణాన్ని సృష్టించారు. విదేశీయులు బయటికి పోవాలంటూ నినాదాలు చేశారు. సూడాన్‌ దేశస్థుడి దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడంతో దేశంలోని పలు ప్రాంతాలలో వందలాది మంది నిరసనకారులు ఆగ్రహావేశాలతో పోలీసులపై దాడి చేశారు. కాగా సూడాన్‌ దేశస్థుడి దాడిలో బాధితుడు తన కుడి కంటి చూపును కోల్పోయాడు. అతని మెడ పైన, వెనుక భాగంలోనూ గాయాలయ్యాయి. జాతి నేపథ్యం కారణంగానే ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని, దీనిని తాను సహించబోనని బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మన్‌ చెప్పారు. బాధ్యులను శిక్షిస్తామని తెలిపారు. ఉత్తర బెల్‌ఫాస్ట్‌లో జరిగిన దాడికి బాధ్యుడైన హదీ అలోడిడ్‌ (30) అనే సూడాన్‌ జాతీయుడిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అతనిని నాలుగు వారాల రిమాండుకు తరలించింది. అతనిపై హత్యాయత్నం ఆరోపణలు మోపారు. 2023లో బ్రిటన్‌లో ప్రవేశించిన అలోడిడ్‌ను ప్రభుత్వం శరణార్థిగా గుర్తించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -