మారిన ఇరాన్ నూతన నాయకత్వ వైఖరి
ప్రాంతీయ మిత్రులకు బాసట
దేనికైనా సిద్ధమేనంటూ సంకేతాలు
టెహ్రాన్ : ఇజ్రాయిల్‌పై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు ఆ దేశం ఇప్పటి వరకూ చేసిన అత్యంత సాహసోపేత ప్రయత్నాలలో ఒకటిగా నిలిచాయి. లెబనాన్‌లో హిజ్బల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ ఈ దాడులు జరిపింది. తద్వారా తమ లక్ష్యాలు సరిహద్దులకే పరిమితం కాబోవని, తమ నాయకత్వం అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నదని సంకేతాలు పంపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్, అమెరికా దేశాలు పదే పదే ఉల్లంఘిస్తూ నీరు కారుస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఒక వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. అదే విధంగా రాజధాని బీరుట్ సహా లెబనాన్‌లో ఇజ్రాయిల్ సుమారు మూడున్నర వేల దాడులు జరిపిందని ఆ దేశ ప్రధాని చెప్పారు. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రణాళికాబద్ధమైన ప్రతీకార దాడులు చేస్తోంది. తద్వారా దౌత్యం విఫలమైతే యుద్ధాన్ని తిరిగి ప్రారంభించి, గల్ఫ్‌కు ఆవల దానిని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించింది. తమ దాడులు హిందూ మహా సముద్రం నుంచి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం వరకూ విస్తరించిన నౌకా రవాణా మార్గాలకు ముప్పు కలిగిస్తాయని కూడా తెలిపింది.
ప్రాంతీయ మిత్రులపై దాడులను అనుమతించం
అమెరికా సైనిక హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడం, దానికి ప్రతిగా హార్ముజ్ సమీపంలోని ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు చేయడం, ఇరాన్ కూడా గల్ఫ్‌లోని అమెరికా లక్ష్యాలపై క్షిపణులు-డ్రోన్లను ప్రయోగించడం వంటి పరిణామాలు పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరతకు అద్దం పడుతున్నాయి. ఇటీవల ఇజ్రాయిల్‌పై జరిపిన దాడులతో ఇరాన్ మరో ముందడుగు వేసినట్లు కన్పిస్తోంది. తమ ప్రాంతీయ మిత్రులపై సైనిక చర్యకు దిగితే చూస్తే ఊరుకోబోమని, నేరుగానే స్పందిస్తామని ఆ దాడుల ద్వారా ఇజ్రాయిల్‌కు తేల్చి చెప్పింది. విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టే వరకూ తమ స్పందన ఇలాగే ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ చెప్పారు. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని చెబుతూ దాడులకు తెగబడడాన్ని అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
సహనానికి స్వస్తి
ఇరాన్ చర్యలు దాని వైఖరిలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. పాత తరం నాయకులు ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకునే వారు. కానీ కొత్త తరం నేతలు వ్యూహాత్మక సహనంపై ఆధారపడడం లేదు. మధ్యప్రాచ్యంలోని పరిణా మాలను ప్రభావితం చేయడానికి ఎలాంటి పరిణా మానికైనా సిద్ధమేనని చెబుతున్నారు. అవసరమైతే ‘రిస్క్’ తీసుకోవడానికి, ఇరాన్ సైనిక-ఆర్థిక-ప్రాంతీయ ప్రభావాన్ని ఉపయోగిం చుకోవడానికి వారు వెనుకాడడం లేదు. ఇరాన్ నాయకత్వం మరింత హేతుబద్ధమైనది, సహేతుకమైనది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చెప్పిన మాటలు ఈ సందర్భంగా గమనార్హం. ఎలాంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కొనేందుకు ఇరాన్ నాయకత్వం సిద్ధంగా ఉంది. యుద్ధంలో తాము విజయం సాధించబోతున్నామని ధీమాగా ఉంది. కాల్పుల విరమణ తమ ప్రయోజనాలను కాపాడడడం లేదని భావిస్తోంది. దశాబ్దాల తర్వాత….ఇజ్రాయిల్ సైనిక విన్యాసాలకు, మూడో పక్షంపై దాని దురాక్రమణకు వ్యతిరేకంగా ఇరాన్ కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఓ ప్రాంతీయ శక్తికి అవకాశాలు, సామర్ధ్యం, సంసిద్ధత ఉండడం ఇదే మొదటిసారి
అమెరికా-ఇజ్రాయిల్ విభేదాలను ఉపయోగించుకుంటూ…
ఇరాన్ పైనే కాకుండా దాని ప్రాంతీయ మిత్రులపై కూడా చర్చలకు ఇజ్రాయిల్ సిద్ధపడుతోంది. అయితే దీనిని అడ్డుకునేందుకు ఇరాన్ ఓ ‘కొత్త సమీకరణా’న్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. దౌత్యం ద్వారా సాధించలేని పనిని బలప్రయోగం ద్వారా సాధించవచ్చునని ఇరాన్ నాయకత్వం భావిస్తోందని చెప్పడానికి తాజా ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇరాన్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య ఇటీవల వాడి వేడి ఫోన్ సంభాషణలు నడిచిన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌పై ఇరాన్ సోమవారం దాడి చేసిన తర్వాత ట్రంప్ వెంటనే స్పందించారు. ఇరాన్‌పై దాడులు చేయవద్దంటూ ఆయన గంటల వ్యవధిలోనే రెండుసార్లు నెతన్యాహూకు టెలిఫోన్‌లో సూచించారు. ఇజ్రాయిల్ సైనిక చర్యకు మద్దతు ఇవ్వడమా లేక టెహ్రాన్‌తో దౌత్య యత్నాలు కొనసాగించడమా అనే దారులలో ఏదో ఒక దానిని ఎంచుకునేలా అమెరికాను ఒత్తిడి చేయడంలో ఇరాన్ విజయం సాధించిందనే చెప్పాలి.



