చేయూత పింఛన్లకు గడువు విధించిన ప్రభుత్వం
మండలంలో మొదలైన దరఖాస్తుల సందడి
నవతెలంగాణ – మల్హర్ రావు
కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరును గడువు తేదీగా నిర్ణయించింది. దీంతో మండల వ్యాప్తంగా గ్రామాల్లో దరఖాస్తుదారుల హడావుడి మొదలైంది. అయితే, దరఖాస్తుకు అవసరమైన పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే వితంతులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్, చేనేత కార్మికులు జౌళి శాఖ సర్టిఫికెట్, దివ్యాంగ, ఫైలేరియా బాధితులు వైద్యారోగ్య శాఖ సర్టిఫికెట్లను సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు.
పక్కాగా క్షేత్రస్థాయి పరిశీలన
ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కొత్త పింఛన్ల దరఖాస్తులు అందాయి. మండల వ్యాప్తంగా వందల్లో అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. దరఖాస్తును పం చాయతీ కార్యదర్శి పరిశీలిం చిన తర్వాత, ఎంపీడీవో కార్యాల యానికి వెళ్తుంది. అక్కడ మరోసారి పరిశీలన చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత అధికారులు స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను క్షుణ్ణంగా పరిశీస్తారు. ఈ పరిశీలన పూర్తయిన తర్వాతే పారదర్శకమైన తుది జాబితాను కలెక్టర్ ఆమోదం కోసం పంపుతారు. కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ఆన్లైన్ ద్వారానే నేరుగా మంజూరు పత్రాలు జనరేట్ అవుతాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని లబ్దిదారులకు అందజేయనున్నారు.



