ఆశలు నిరాశలేనా..?

– మండల ప్రజల్లో ఆశలు రెకెత్తించిన మళ్లీ జిల్లాల పునర్విభజన అంశం
– టీపీసీసీ అధ్యక్షుల హామీలపై ఎదురుచూపులు
– కాంగ్రెస్ ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న ప్రజల ఆశలు
– ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు పరుచాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి 
ఉద్యమాలకు ఊపిరిపోసిన జిల్లాగా కరీంనగర్ ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జీవానోపాధి కోసం వెళ్లిన జిల్లా వాసులు సైపం ఇతర దేశాల్లో తమ జిల్లా ప్రాబల్యం ఎంటో చూపించారు. జిల్లాల పునర్విభజనకు ముందు బెజ్జంకి మండల ప్రజలు కాస్తోకూస్తో ఆనందమయ జీవనం సాగించారనడంలో అతిశయోక్తి లేదు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున లేవడం..నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవ్వడం..తదనంతరం పరిపాలన అధికారం చేపట్టిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరునా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని జిల్లాల పునర్విభజన చేపట్టడంతో మండల ప్రజలకు విద్య,వైద్యం,రవాణ,స్థానికతలో పుట్టెడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.పునర్విభజన నాటి నుండి నేటి వరకు మండల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎనాటికైనా తిరిగి కరీంనగర్ జిల్లాలో మళ్లీ కలువకపోతమా అనే ఆశతో మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.గత కొద్దేండ్లుగా నిరాశతో ఉన్న మండల ప్రజలను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనాధికారం చేపట్టిన అనంతరం బెజ్జంకి మండలాన్ని తిరిగి యథావిధిగా కరీంనగర్ జిల్లాలో కలిపి తీరుతామనే టీపీసీసీ అధ్యక్షుడు హమీ ఇవ్వడం..కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన అధికారం చేపట్టడం మండల ప్రజల్లో నూతన ఆశలు రెకెత్తాయి. టీపీసీసీ అధ్యక్షులు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసి తమ కరీంనగర్ జిల్లా స్వప్నాన్ని నెరవేర్చాలని మండలంలోని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఎండ్లుగా కరీంనగర్ జిల్లాలో కొనసాగిన బెజ్జంకి మండలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన జిల్లాల పునర్విభజనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో కలిపింది. దీంతో విద్య,వైద్యం,ఉపాధి రవాణలో మండల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు బాహటంగానే చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా నుండి విడదీసి సిద్దిపేట జిల్లాలో కలిసిన నేటికి మండల ప్రజలు కరీంనగర్ జిల్లాతో ఉన్న అనుబందాన్ని విడువలేకపోతున్నారు. వైద్యం కోసం మండల ప్రజలు పూర్వపు కరీంనగర్ జిల్లానే ఆశ్రయిస్తున్న విద్య,ఉపాధిలో స్థానికేతరులుగా మారడంతో ఉన్నత చదువులు చదివిన యువతకు సింగరేణి వంటి సంస్థలో స్థానికేతరులుగా మారడం ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. నాటి నుండి నేటి వరకు జిల్లా కేంద్రం నుండి రవాణ సౌకర్యాల్లేక మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న ఆశలు: డిసెంబర్ 23,2023న మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ అవరణం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ విజయభేరి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ప్రజలకు హమినిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యాంగ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిబద్ధత కొలమానం లేకుండా జిల్లాల పునర్విభజన చేపట్టిందని మళ్లీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అసెంబ్లీలో చర్చించి జిల్లాల పునర్విభజన చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మండల ప్రజల్లో ఆశలు రెకెత్తాయి.అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాల పునర్విభజన అంశం చర్చకు రాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండల ప్రజల ఆశలు సన్నగిల్లుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ నెరువెర్చుతారా లేకా గత ప్రభుత్వం వలే ఈ ప్రభుత్వం హమీలకే పరిమితం చేస్తుందా అనే సందిగ్దంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చోరవ చూపి మండలాన్ని తిరిగి కలిపే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love