కార్పొరేట్‌ కాలేజీలకు వేసవి సెలవులు వర్తించవా..?

– యథేచ్ఛగా తరగతుల నిర్వహణ
– నిద్రావస్థలో జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు
– ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వర్తించే వేసవి సెలవులు కార్పొరేట్‌ కాలేజీలకు వర్తించవా..? అని ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్‌ కాలేజీలకు సర్కార్‌ వేసవి సెలవులు ప్రకటిస్తే జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ, రెసోరెన్స్‌ కార్పొరేట్‌, ప్రయివేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించడం సరికాదని, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంతోష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ప్రకటించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు సర్క్యూలర్‌ జారీ చేసినా జిల్లాలో కొన్ని కాలేజీలు పాటిం చడం లేదన్నారు. ఇంటర్‌ బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి యథే చ్ఛగా తరగతులు నిర్వహిస్తూ అధికారులకే చాలెంజ్‌ చేస్తున్నా యన్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి వెళ్తున్న విద్యార్థులను కాలేజీలకు రావాలని ఇబ్బం దులు పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్నారు. 2024-2025 అకాడమిక్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్‌, ప్రయివేటు కాలేజీలు ఇప్ప టికే అడ్మిషన్స్‌ 50 శాతానికి పూర్తి చేశాయన్నారు. ఇంటర్మీడియట్‌ అధికారులు మాత్రం అడ్మిషన్‌ చేస్తే చర్యలు తప్పవు అని ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు’ ఇంటర్‌ బోర్డు ప్రకటన ఉందన్నారు. ఇలాంటి పరిణామాల్ని చూస్తుంటే ఇంటర్‌ బోర్డు కేవలం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు మాత్రమే సెలవులు ఇచ్చినట్టుగా ఉందన్నారు.
నిద్రావస్థలో జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని రాథోడ్‌ సంతోష్‌ అన్నారు. కొన్ని కాలేజీలు వేసవి సెలువులు ఇవ్వడం లేదని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికా రులకు అనేక సార్లు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా.. ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు తీసుకోలేదన్నారు. వేసవి సెలవుల్లేకుండా యధావిధిగా క్లాసులు నడిపిస్తున్నా.. ‘దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా’ జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు నిద్రావస్థలో ఉన్నా రన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆయా కాలేజీలకు స్వయం గా వెళ్లి వర్యవేక్షించి విద్యార్థులకు సెలవులు ఇప్పించాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఇంటర్‌ బోర్డ్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

 

Spread the love