మామూలు నాయకులను పట్టించుకోరా?
నాన్న చావు కంటే..కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే బాధిస్తోంది!
సాయం అందించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు వేడుకోలు!
నవతెలంగాణ-అక్కన్నపేట
ఓట్లప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారా, పనిచేసిన వారికి గుర్తింపు ఉండదా అంటూ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. ఒక గ్రామానికి అధ్యక్షున్ని అయి ఉండి, పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ నాకు, కష్టం వస్తే కన్నెత్తి చూసిన నాయకులు లేరు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుంటే ఇంకెప్పుడు ఆదుకుంటారని ప్రశ్నించారు. పార్టీలో పని చేసే పెద్ద పెద్ద నాయకులకు ఆపద వస్తే టక్కున వాలిపోయే పార్టీ క్యాడర్, చిన్న చిన్న కార్యకర్తలపై చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓట్లపుడే కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడం మళ్ళీ ఐదేళ్లదాకా వారి వైపు చూడకపోవడం దారుణమన్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే అక్కన్నపేట మండలం దాస్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు రాజేందర్ తండ్రి రంగా గత ఐదు రోజుల క్రితం, అతను పని చేస్తున్న ప్రదేశంలో వడ దెబ్బ తగిలి గుండె నొప్పితో మరణించారు. ఆయన మృతి చెంది వారం రోజులు గడిచినా కానీ, కాంగ్రెస్ పార్టీ అక్కన్నపేట మండల క్యాడర్ కనీసం వారి ఇంటి వైపు కన్నెత్తి చూడలేదని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేశారని, ఆ తర్వాత నేను పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నానని గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ జెండాను మా కుటుంబం వదలలేదని అన్నారు. అలాంటి మా కుటుంబ పెద్ద, మా నాన్న మరణించినా కానీ, పార్టీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ విషయం చెప్పకపోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందని చెప్పుకుంటూనే కార్యకర్తలను ఇలా విస్మరించడం సమంజసం కాదని తెలియజేశారు. మా నాన్న చనిపోయిన నేను గుండె నిబ్బరంగా ఉన్నానని, కానీ పార్టీ నాయకులు ఎవరు నన్ను పరామర్శించకపోవడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.



