తెలంగాణకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల రాక

నవతెలంగాణ- హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈసీ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఇందులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌ వి నాయక్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌మిశ్ర, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఆర్‌.బాలకృష్ణన్‌ ఉన్నారు. వారు సోమవారం రాష్ట్రానికి వచ్చిన క్రమంలో ఇక్కడి ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘పోలీసు సిబ్బందికి వారి పోలీసుస్టేషన్‌ పరిధిలోని పోలింగు కేంద్రాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించాలి. పోలింగ్‌ రోజున విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తాన్నీ ర్యాండమైజేషన్‌ చేయాలి. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు చేసిన వారి వివరాలను సెల్‌ఫోన్‌ నంబరు సహా జిల్లాల వారీగా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. పరిశీలకులు వారితో ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఎంత మేరకు పరిష్కరించారో తెలుసుకుంటూ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగు ఏజెంట్లు విధిగా సీ-విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు సెల్‌ఫోన్‌లో కాకుండా వీడియో కెమెరాలతోనే ఆయా వ్యవహారాలను చిత్రీకరించాలి.

Spread the love