నవతెలంగాణ-హైదరాబాద్ : గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఒక విమానం 55 మంది ప్రయాణికులను బస్సులో వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 9న ఉదయం 6.30 గంటలకు గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన జీ8 116 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్‌లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన నాలుగు బస్సుల్లో ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న డీజీసీఏ, గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు నోటీస్ పంపింది. ఈ సంఘటనతోపాటు పలు నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరింది. విమానంలోకి ప్రయాణీకులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కోఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బంది, విమాన సిబ్బంది మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. మరోవైపు బస్సులోనే వదిలేసిన 55 మంది ప్రయాణికులకు గోఫస్ట్ సంస్థ క్షమాపణలు తెలిపింది. బాధిత ప్రయాణికులు ఏడాదిలోపు దేశంలో ఎక్కడికైనా సంస్థ విమానంలో ప్రయాణించేందుకు ఒక ఉచిత టికెట్ ఇచ్చింది. అలాగే ఈ సంఘటనకు బాధ్యులైన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది.