ఢిల్లీ చేరుకున్న జో బైడెన్‌

ఢిల్లీ చేరుకున్న జో బైడెన్‌
ఢిల్లీ చేరుకున్న జో బైడెన్‌

నవతెలంగాణ న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర ఉన్నతాధికారులు విచ్చేశారు. జో బైడెన్‌ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోడీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. జేఈ జెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్‌, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు కూలంకషంగా చర్చించనున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ ఇదివరకే మీడియాకు వెల్లడించారు.
భేటీ అనంతరం ఐటీసీ మౌర్యాలో అమెరికా అధ్యక్షుడు బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లను ఇప్పటికే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ హోటల్‌ 14 వ అంతస్తులో బైడెన్‌ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్‌ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ హోటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్‌ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

Spread the love