అమ్మగా.. వ్యాపారవేత్తగా…

ఎంత పని చేస్తున్నా తరగదు. పిల్లలతో ఎంత గడిపినా తనివి తీరదు. అమ్మగా ఇంత బిజీగా ఉంటూనే అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ విజయవంతమవుతున్నారు నేటి మహిళలు. అలాగే మరికొంతమంది వ్యాపారవేత్తలుగానూ రాణిస్తున్నారు. తాము పాటిస్తున్న కొన్ని సింపుల్‌ చిట్కాలే తమ విజయానికి కారణమంటున్నారు వీరు. అవే ఇంటినీ, వృత్తిని బ్యాలన్స్‌ చేసుకోవడానికి, తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి దోహద పడుతున్నాయంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం…
సాధారణంగా మహిళలు ఇంటి పనులు, పిల్లల బాధ్యతల్లో పడిపోయి తమను తాము నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఈ అశ్రద్ధే మానసిక ఒత్తిడికి కారణం. ఫలితంగా కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టలేక పోతున్నారని అంటున్నారు నిపుణులు. అందుకే రోజును ప్రారంభించే ముందే తమకు తాము కొంత సమయం కేటాయించుకోవాలంటున్నారు. అంటే తమ అభిరుచులపై దృష్టి పెట్టడం, మనసుకు నచ్చిన పనిచేయడంతో ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. దాంతో శరీరంలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇదే రోజంతా యాక్టివ్‌గా పనిచేసే శక్తినిస్తుంది. ఇలా సానుకూల దృక్పథంతో రోజు ప్రారంభిస్తే వ్యాపారంలో మనం తీసుకునే నిర్ణయాలూ పాజిటివ్‌గా ఉంటాయని, ఇవే మన ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రాధాన్యతలను బట్టి…
వ్యక్తిగతంగానైనా, కెరీర్‌ పరంగానైనా.. చేసే ప్రతి పని పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు చాలామంది. ఉన్న సమయంలోనే అన్ని పనులు పూర్తి చేయాలనుకుంటారు. అయితే ఈ పర్‌ఫెక్షనిజం అన్ని సందర్భాల్లోనూ మేలు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంటి పనులు, పిల్లలు, వ్యాపార బాధ్యతలు పోను.. మనకు మిగిలేది అతి కొద్ది సమయం. ఆ సమయంలోనే మిగతా పనులు పెట్టుకొని ఒత్తిడికి గురయ్యే బదులు.. ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకుంటే మంచిది. అవసరమైన పనుల్నే ముందుగా పూర్తి చేసేయచ్చు.. మిగతావి తర్వాత వీలు చూసుకొని పూర్తిచేసుకోవచ్చు. ఇంటి పనులు, పిల్లల విషయాల్లోనే కాదు.. వ్యాపార నిర్వహణకూ ఇది వర్తిస్తుంది. అలాగే ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులు, పిల్లల సహాయం తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఒత్తిడీ ఉండదు, పనులూ త్వరగా పూర్తవుతాయి.
పని వేళలు నిర్దేశించుకోవాలి
వ్యాపార నిర్వహణలో ఓ నిర్ణీత పని వేళలంటూ ఉండవు. చాలాసార్లు పని రాక్షసుల్లా ఆఫీసుకే పరిమితవ్వాల్సి రావచ్చు. ఇలా అపరిమిత పనుల వల్ల మానసిక ఒత్తిడికి గురవడమే కాదు.. పనిలో నాణ్యత కూడా కొరవడుతుంది. అందుకే ఉద్యోగంలాగే వ్యాపారానికీ కచ్చితమైన పనివేళల్ని నిర్దేశించుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే పనుల ప్రాధాన్యతల్ని బట్టి ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులు, మీటింగ్స్‌, ఇతర పనుల కోసం ఓ ప్రణాళిక వేసుకుంటే.. మధ్యమధ్యలో తడబడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ సమయంలోనే మనం అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేయగలిగితే సమయం ఆదా అవుతుంది. తద్వారా మనసుకు ప్రశాంతత, శరీరానికి ఉత్సాహం.
ఏకకాలంలో వివిధ పనులా…
కొంతమంది ఇంటి నుంచే వ్యాపారాన్ని నిర్వహిస్తుం టారు. ఇటు ఇంటి పనులు, అటు పిల్లల బాధ్యతను చూసుకుంటూనే మరోవైపు బిజినెస్‌పై దృష్టి పెడుతుంటారు. ఈ మల్టీ టాస్కింగే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల పనిలో ఉత్పాదకత 40 శాతానికి పైగా తగ్గచ్చని ఓ అధ్యయనం రుజువు చేసింది. ఏకకాలంలో వివిధ రకాల పనులు చేయడం వల్ల ఏ పని పైనా పూర్తి దృష్టి పెట్టలేకపోవడమే ఇందుకు కారణం అంటోంది. కాబట్టి వ్యాపారం, ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు.. ఇలా దేనికోసం నిర్దేశించుకున్న సమయంలో ఆ పని పైనే దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ పనిలో సక్సెస్‌ కాగలుగుతాం.
కుటుంబంతో సరదాగా…
ఇంటి బాధ్యతలు, వ్యాపార నిర్వహణ.. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవాలంటే ముందు మనకు మనం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇందుకోసం రోజూ కాసేపు పనులన్నీ పక్కన పెట్టి కుటుంబంతో తగిన సమయం గడపాలంటున్నారు నిపుణులు. మీ కెరీర్‌ పనులు, పిల్లల స్కూల్‌ దృష్ట్యా.. మూడు పూటలా అందరూ కలిసి తినే అవకాశం ఉండకపోవచ్చు.. కానీ ఏదో ఒక పూట.. మీ పిల్లలతో పాటు తినే వెసులుబాటు చేసుకోవడం ముఖ్యం. అలాగే అప్పుడప్పుడూ వెకేషన్లకూ ప్లాన్‌ చేసుకోవాలి. ఇలా కుటుంబంతో సమయం గడుపు తున్నప్పుడు సోషల్‌ మీడియా, మొబైల్‌ వంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అప్పుడే మీరు మీ పిల్లల్ని, మీ పిల్లలు మిమ్మల్ని మిస్సవకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా మీ అనుబంధమూ పెరుగుతుంది. ఇలా కుటుంబం నుంచి దక్కిన ప్రేమ.. వ్యాపారాభివృద్ధి లోనూ కీలకపాత్ర పోషి స్తుంది. పనిలో ఉత్పాదకతను సైతం పెంచుతుంది.

Spread the love