అమ్మలాంటి అత్తమ్మతో ఇలానా..!

భార్యాభర్తల మధ్య ఉండే అనురాగం ప్రేమ కాదా? తల్లి కొడుకుపై, తండ్రి కూతురుపై చూపించే ఆప్యాయత ప్రేమ కాదా? కానీ ప్రేమ అంటే కేవలం ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండేదే అనుకుంటున్నారు నేటి యువత. ప్రేమకు అసలైన నిర్వచనం అర్థం చేసుకోలేక తప్పటడుగు వేస్తున్నారు. అలాంటి సమస్యతోనే ఈ వారం ఐద్వా అదాలత్‌కు వచ్చింది స్నేహ. మరి ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందో లేదో మీరే చదవండి…
‘అమ్మాయిలు, అబ్బాయిల మధ్య కలిగే ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు, తల్లి పిల్లలపై చూపే ఆప్యాయతను కూడా ప్రేమే అంటారు. నేను నీపై చూపుతున్నది ఒక తల్లి కొడుకుపై, ఒక అక్క తమ్ముడిపై చూపే ప్రేమ లాంటిదే తప్ప ఇంకొకటి కాదు’ అంటూ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు.
‘అత్తమ్మ మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా నాకు మంచి ఫీలింగ్‌ వస్తుంది. కానీ నేను పెండ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని చూసినా, తాకినా అలాంటి ఫీలింగ్‌ రావడం లేదు. పెండ్లి చేసుకుంటే ఆమెకు అన్యాయం చేసిన వాడినవుతానేమో’ అనడం మొదలుపెట్టాడు.
స్నేహకు 20 ఏండ్లు ఉన్నప్పుడు రాహుల్‌తో పెండ్లి జరిగింది. ఆమెది చిన్న కుటుంబం. రాహుల్‌ది పెద్ద కుటుంబం. బంధువులందరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. రాహుల్‌ పెండ్లయిన తొలిరోజు ‘మా బంధువులందరినీ సొంత వారిలా చూసుకోవాలి, ఎవరైనా ఏమైనా అన్నా తప్పుగా అనుకోకుండా సర్దుకుపోవాలి. మన వల్ల ఈ కుటుంబం ఎప్పుడూ విడి పోకూడదు. అందరిని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేస్తానని నాకు మాట ఇవ్వు’ అని అడిగాడు. ఆమె కూడా సంతోషంగా మాట ఇచ్చింది. అలాగే నడుచుకునేది. ఆ కుటుంబంలో మొత్తం 10 మంది ఉంటారు. ఆడపడుచు ఇంటి పక్కనే ఉంటుంది. ఆమెకు నలుగురు పిల్లలు. వాళ్ళందరూ ఎప్పుడూ ఇక్కడే ఉండేవారు.
ఆడపడుచు కొడుకు అర్జున్‌. స్నేహ కాపురానికి వచ్చినపుడు అతని వయసు పదేండ్లు. అర్జున్‌కు స్నేహంటే ప్రాణం. వాళ్ళ అమ్మ కంటే కూడా స్నేహతోనే ఎక్కువ అనుబంధం. ప్రతి చిన్న విషయం ఆమెతోనే పంచుకునేవాడు. వాళ్ళ అమ్మ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేది కాదు. స్నేహ మాత్రం అతని మంచీ చెడు అన్నీ చెబుతుండేది. అర్జున్‌ ఇంటర్‌కి వచ్చాడు. స్నేహతో కలిసి పండుగలకి వాళ్ళ అమ్మ ఇంటికి వెళుతుండేవాడు. కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనేవారు కాదు. స్నేహ అర్జున్‌ను చిన్న పిల్లవాడిగానే చూసేది. అలాగే మాట్లాడేది. షాపింగ్‌కి వెళ్ళినపుడు అతని కోసం ఏదో ఒకటి తెచ్చేది. కానీ అర్జున్‌ ప్రవర్తనలో మెల్లిమెల్లిగా మార్పు వచ్చింది. స్నేహతో ఎక్కువ సమయం గడిపేది. పైగా ఆమెతో ‘ఇతరులతో ఎక్కువగా మాట్లాడవద్దు. నాతోనే మాట్లాడాలి’ అనే వాడు. ఎవరితోనైనా మాట్లాడితే గొడవ చేసేసేవాడు. మొదట్లో స్నేహ ఇవేవీ పెద్దగా పట్టించుకోలేదు.
‘నీవు నాకు మాత్రమే కావాలి. నేనెందుకు మీ తర్వాత పుట్టానో. మీకంటే ఒక రోజు పెద్దవాడినైనా బాగుండేది. మామ స్థానంలో నేను ఉంటే ఎంత బాగుండేదో. నాకు మామను చూస్తే జెలసీగా అనిపిస్తుంది. అత్తమ్మ నీవు ఎందుకు నాతో అలా ఉండవు. మామతో ఎలాగైతే ఉంటావో నాతో కూడా అలాగే ఉండొచ్చు కదా! నన్ను అలా చూసుకునేవారు ఎవరూ లేరు. మీరు నా జీవితంలోని వచ్చిన తర్వాతే కొంచెం సంతోషంగా ఉంటున్నాను’ అనేవాడు.
ఇలాంటి విషయాలు విని కూడా స్నేహ అతన్ని ఏమీ అనేది కాదు. ‘నేను నీకు అమ్మ తర్వాత అమ్మలా ఉంటాను. నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను, అది నా బాధ్యత’ అని ఓదార్చేది. అర్జున్‌ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ జరిగి తండ్రి అతన్ని కోపంతో ఇంట్లో నుండి పంపించేశాడు. అప్పటి నుండి అర్జున్‌, స్నేహ వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. అందుకే అర్జున్‌ ఏమన్నా స్నేహ పెద్దగా పట్టించుకోదు.
వాళ్ళ కాలేజీలో జరిగిన ప్రతి సంఘటన స్నేహకు చెప్పేవాడు. మెల్లమెల్లగా కాలేజీలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య జరిగే సంఘటనలు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. బయటకు చెప్పకూడని విషయాలు కూడా చెబుతుండేవాడు. ‘నేను మీ అత్తమ్మను, ఎందుకురా ఇలాంటి విషయాలు నాకు చెబుతావు’ అన్నా వినడు. రాను రాను అతని మాటల్లో చాలా మార్పు వచ్చింది. అది గుర్తించిన స్నేహ ‘అమ్మాయిలు, అబ్బాయిల మధ్య కలిగే ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు, తల్లి పిల్లలపై చూపే ఆప్యాయతను కూడా ప్రేమే అంటారు. నేను నీపై చూపుతున్నది ఒక తల్లి కొడుకుపై, ఒక అక్క తమ్ముడిపై చూపే ప్రేమ లాంటిదే తప్ప ఇంకొకటి కాదు’ అంటూ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు.
అర్జున్‌కి 26 ఏండ్లు వచ్చినా స్నేహపై అలాంటి ఆలోచనలతోనే ఉన్నాడు. దాంతో స్నేహ ‘నీవు మీ ఇంటికి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి’ అని అర్జున్‌ను వాళ్ళ ఇంటికి పంపించింది. అప్పటి నుండి రెండేండ్లు స్నేహతో మాట్లాడలేదు. అర్జన్‌ వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటినుండి మళ్ళీ మాట్లాడేవాడు. అర్జున్‌లో మార్పు వచ్చిందనుకుంది స్నేహ. అతను కూడా ‘అత్తమ్మ మీరు దూరంగా ఉంటే మీపై నాకు ప్రేమ ఇంకా ఎక్కువయింది. మీపై గౌరవం కూడా పెరిగింది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నన్ను అసహ్యించుకోలేదు. పైగా నాకు ఎంతో ఓపికతో నచ్చజెప్పారు. గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోదాం’ అన్నాడు.
అర్జున్‌ ఒకమ్మాయిని ప్రేమించాడు. ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతను మాత్రం ‘అత్తమ్మ మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా నాకు మంచి ఫీలింగ్‌ వస్తుంది. కానీ నేను పెండ్లి చేసుకో వాలనుకునే అమ్మాయిని చూసినా, తాకినా అలాంటి ఫీలింగ్‌ రావడం లేదు. పెండ్లి చేసుకుంటే ఆమెకు అన్యాయం చేసిన వాడినవుతానేమో’ అనడం మొదలుపెట్టాడు.
‘మీ గురించి అలా ఆలోచించకూడదని ఎంత అనుకున్నా నా వల్ల కావడం లేదు’ అనేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్నేహ కు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్జున్‌ ఆలోచనలు ఎలా మార్చాలో తెలియక ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. ఆమె సమస్య మొత్తం విన్న సభ్యులు అర్జున్‌కు ఫోన్‌ చేసి పిలిపించి ‘నువ్వు ఆలోచించే విధానం తప్పు. నీ వల్ల మీ అత్తమ్మ చాలా బాధపడుతుంది. ఆమె నిన్ను ఓ కొడుకులా, తమ్ముడిలా భావించింది. నీకు నీ ఇంట్లో అందని తల్లి ప్రేమను తను పంచింది. నువ్వు కూడా అలాగే భావించాలి తప్ప, వేరే విధంగా ఆలోచించడం సరికాదు. ఇలా మీ అత్తమ్మను ఇబ్బంది పెట్టడం సరైన దేనా? అత్తమ్మలోనే అమ్మ అనే పదం వుంది. పైగా నువ్వేంతో అభిమానించే, గౌరవించే నీ అత్త నీ వల్ల బాధపడుతుంటే నువ్వు భరించగలవా? అమ్మలాంటి అత్తమ్మను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు చక్కగా పెండ్లి చేసుకుని హాయిగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. అలాంటి అత్తను బాధపెడతావా ఆలోచించుకో’ అన్నారు.
దానికి అతను ‘నా వల్ల మా అత్తమ్మ ఇంత బాధపడుతుందని అనుకోలేదు. నాకు మా అత్తమ్మ తర్వాతే ఎవరైనా. మా అమ్మ కంటే నాకు మా అత్తమ్మనే ఎక్కువ. ఆమెకు చిన్న బాధ కలిగినా తట్టుకోలేను. అది నావల్ల అంటే అసలే భరించలేను. ఇకపై నా వల్ల అత్తమ్మకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అన్నాడు.
స్నేహతో మాట్లాడుతూ ‘ఇక మీకు అర్జున్‌ వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరేం భయపడకండి. చిన్నప్పటి నుండి అతనికి మీరు ఎంతో ప్రేమను పంచారు. ఎంతో గారాబంగా చూసుకు న్నారు. దాంతో అతను మీకు దూరంగా ఉండ లేక పోతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. తెలిసీ తెలియని వయసులో ఇలా ప్రవర్తించే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి మార్పు తీసుకురావాలి. తన ప్రవర్తన మారకపోతే కౌన్సెలింగ్‌ కూడా ఇప్పిద్దాం. మీరేం బాధపడకుండా ధైర్యం గా ఉండండి’ అని చెప్పి పంపించారు.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love