ఫసల్ భీమాతో రైతులకు భరోసా…

– ప్రధాన మంత్రి ఫసల్‌ భీమాలోకి రాష్ట్ర ప్రభుత్వం..
– రైతులకు ఉచితంగా భీమా ప్రీమింయం
– వానాకాలం నుండి అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం..జిల్లాలో 2.90 లక్షల మంది రైతులకు లబ్ధి చేరనుంది..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రైతులపై ప్రకృతి ఎప్పుడు కరుణ చూపుతుందో.. పగబడుతుందో తెలియదు.పంటలు సాగు చేసుకున్న తరవాత చేతికొచ్చేదాకా ఆందోళన గానే ఉంటుంది. ఓ పక్క అనావృష్టి, మరో పక్క అతివృష్టి అన్నదాతలకు కడగళ్లు మిగులుస్తాయి. దీంతో రూ. వేలల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పంటకాలం నుంచి పీఎం ఫసల్‌ బీమా యోజనలో చేరేందుకు నిర్ణయించింది.
వ్యవసాయదారితంగా సూర్యాపేట జిల్లా..
సూర్యాపేట వ్యవసాయాధారిత జిల్లా కావడంతో ముఖ్యంగా వరి, పత్తి, మొక్క జొన్న, జొన్న, కందితో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులతో నష్టం వాటిల్లితే పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు అన్నదాతలు బీమా చేసుకుంటారు. గతంలో 2016 నుంచి 2020 వరకు రాష్ట్రం ఫసల్‌ బీమా పథకంలో భాగంగా ఉండేది. అప్పుడు చాలా మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఆ తరవాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ  పథకంలో నుంచి వైదొలిగారు. ఇప్పుడు మళ్లీప్రధాన మంత్రి ఫసల్‌ బీమాలో రాష్ట్ర ప్రభుత్వం చేరాలని నిర్ణయించడంతో జిల్లాలో వేలాది మంది రైతులకు ప్రయో కలగనుంది.
ప్రస్తుత ఎండాకాలం లో 3,84,567 ఎకరాల్లో సాగు..
జిల్లాలో 2.90లక్షల మంది రైతులున్నారు. ప్రస్తుత ఎండాకాలం సీజన్లో 3,84,567 ఎకరాల్లో పంటలు వేశారు.గతేడాది ఇదే సీజన్లో 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో వరి పంట చేతికి వస్తున్న సమయంలో వడగళ్ల వాన కురవడంతో వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. 33,264 మంది రైతులు నష్టపోగా.. 32,718 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి నేలరాలి రూ. లక్షల్లో నష్టపోయారు. ప్రస్తుతం ఫసల్‌ బీమాలో చేరడంతో రైతులకు మేలు కలగనుంది. వానలు, వడగళ్లతో పంటలు నష్టపోతే బీమా చేసుకున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ముఖ్యాంశాలు ఇలా..
ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో రైతులు అతి తక్కువ ప్రీమియాన్ని చెల్లిస్తారు.ఆహార ధాన్యాలు లేదా నూనెగింజలకు ప్రతి సీజనకు ఒకే ప్రీమియాన్ని నిర్ణయించింది.ఈ ప్రీమియం ఖరీఫు లో 2 శాతం నిర్ణయించగా, రబీకి 1.5 శాతంగా నిర్ణయించారు.పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు లేదా నాట్లు వేయలేకపోవటం, పంట కోత  తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది.వరద ముంపు వంటి విపత్తులకు వర్తిస్తుంది. అంతేకాదు క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని వేయటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. అంచనా స్మార్ట్ ఫోన్ల ద్వారా పంట కోత సమాచారాన్ని ఫొటోలు తీసి, అప్లోడ్ చేస్తారు.బ్యాంకు రుణాలు తీసుకున్న వారు పంట బీమా ప్రస్తుతం తప్పనిసరి.వచ్చే మూడేళ్లలో మొత్తం పంటల విస్తీర్ణంలో బీమా కవరేజీని 50 శాతానికి పెంచనున్నారు.రాష్ట్రం మొత్తానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది.విపత్తులతో జరిగే నష్టానికి, కోతల తర్వాత జరిగే నష్టానికి పొలం స్థాయిలో అంచనా వేస్తారు. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేట్ బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలు చేస్తాయి.
సంబంధిత సమాచార ప్రణాళిక..
ప్రధానమంత్రి పంట బీమా పథకం పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది.అలాగే.రబీ ఆహారధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు.ప్రీమియంలో మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి…
ఈ బీమా తో రైతులకు ఎంతో మేలు..మోతే మండలం తుమ్మలపల్లి గ్రామం రైతు చల్లా వెంకయ్య..
ఫసల్‌ బీమా పథకం రైతులకు ఎంతో మేలుకలిగిస్తుంది. పండించిన పంటలు చేతికి వచ్చేదాకా అనుమానంగానే ఉంది.ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే దెబ్బ తింటుంటే ఏమీ చేయ లేని దుస్థితి నెలకొంది.అదే ప్రతీ రైతు పసల్ బిమా చేసుకుంటే రైతులకు ఎంతో దీమాగా ఉంటుంది.

Spread the love