అసమాన్య రసావిష్కరణ

Asymmetric alchemyతెలుగు నాట అటువంటి ‘నాటక రంగ మూలస్తంభాల’ను మూలమూలలా వెతికి తెచ్చి ద్విశతాధికంగా ఒక్కచోట చేర్చి ఒక మేలిమి బృహత్‌గ్రంథంగా రూపకల్పన గావించడం సాధారణ విషయం కాదు. మన కాలపు నాటక రంగ పరిశోథకులు కందిమళ్ల సాంబశివరావు, వాడ్రేవు సుందరరావులు ఈ పనిని రచయితలుగా అత్యంత ఆపేక్షతో భుజాన ఎత్తుకున్నారు. అజో విభో కందాళం ఫౌండేషన్‌ వారు దీనిని ప్రచురించారు.
‘గణనీయమైన చరిత్ర గల నాటకం తెలుగు రంగస్థలం మీదకి ఆలస్యంగానే అడుగుపెట్టింది. కారణాలు ఏవైనా పాశ్చాత్య నాటక ప్రభావం లేకుండా రచింపబడిన తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం కీ.శే. కోరాడ రామచంద్రశాస్త్రి గారు. 1860లో రచించిన ఈ నాటకం 1906లో ముద్రణకు నోచుకుంది అని ప్రకాశకుల మాటలో అప్పాజోస్యుల సత్యనారాయణ వివరించారు. దాదాపు ఏభై ఏండ్ల అనంతరం నాటకరంగ చరిత్రలో ఓ ముఖ్య ఖాళీగా ఎత్తి చూపారు. ఇటువంటి ఖాళీల పూరకం అన్నట్టుగా దాదాపు 150 ఏండ్ల తెలుగు నాటక రంగ చరిత్రకు ఈ గ్రంథం తెరతీసింది. ఇదో విహంగ వీక్షణం కూడా.
రంగస్థలానుభవం లేని నాటక కర్త నాటకం ప్రేక్షకానురక్తిని సాధించలేదు అన్న సత్యాన్ని ఉటంకిస్తూనే నటులై వుండి రచయితలుగా, దర్శకులుగా బాధ్యతలు స్వీకరించి విశిష్ట కీర్తి సముపార్జించిన మహనీయుల కృషిని తెలపడమే గ్రంథ విశేషమని వారు వివరించారు.
భూత భవిష్యత్‌ వర్తమాన త్రికాలాలలోని త్రిగుణాత్మకమైన (సత్య, రజో, తమో) మానవ చిత్ర ప్రవృత్తుల లోకానువృత్తమే నాటకం అని భావించినప్పుడు నాటకం కేవలం జీవన ప్రతిబింబమే కాదు, ఒక జాగృత స్వప్నం కూడా. జీవితం ఇంత వరకు ఎలా వున్నదీ తెలపడమే కాదు, ఎలా వుండబోతున్నదీ, ఎలా వుంటే బావుంటుంది అనే దార్శినకతను కూడా చూపగలదు. జాతిని అప్రమత్తం కమ్మని హెచ్చరించగలదు.
కనుకనే డా||దీర్ఘాసి విజయభాస్కర్‌ ‘జీవితమే రచనకు పునాది’ అంటూ గ్రంథాన్ని పరామర్శించారు. ‘పౌరాణిక ఇతివృత్తాలు పాగా వేసినప్పుడు పద్యం రాజ్యమేలింది. అయితే సమకాలీన సమస్యల ఆవిష్కరణ, పరిష్కారమార్గాల అన్వేషణ ప్రధాన లక్ష్యం అయినప్పుడు ఆధునిక నాటకం తెలుగు రంగస్థలం వేళ్లూనుకుంది’ అని విశదపరిచారు.
రేయింబవళ్లులా నాటకం – జీవితం పెనవేసుకునే వుంటాయి. ముఖ్యంగా నాటక రంగకర్తలకు జీవితంలోనూ, నాటకంలోనూ ఆ కళామూర్తి ఏ విలువల కోసం నిలబడ్డాడో, జీవితాన్ని ధారపోసాడో, ప్రాణాలను ఫణమొడ్డాడో రేఖామాత్రంగానైనా తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. వారు పడిన జీవన, మానసిక సంఘర్షణలు కొంతలో కొంతైనా అర్ధమవుతాయి. అలాగే వారి జీవితకాలంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, వారి నాటక కళపై ఆ ప్రభావాలూ తెలుస్తాయి. అందుకే సుదీర్ఘకాలంగా సాగుతున్న తెలుగు నాటక రంగ భాండాగారాన్ని తెరవడానికి ఈ గ్రంధం ఒక తాళాల గుత్తి వంటిదని విజయభాస్కర్‌ అభివర్ణించారు.
ఈనాటి సాహిత్యం – సినిమాల్లో ప్రేమ ప్రధాన వస్తువుగా వుంటే, ఆనాటి సాహిత్యంలో ధర్మం, అదీ వర్ణాశ్రమ ధర్మం పీఠం ఎక్కినట్టు చెప్తూనే తెలుగు పల్లెల్లోని ఒక పశువుల కాపరి చేత పద్యం పాడించేటట్టు చేయగలిగింది పద్య నాటకమైతే, తన పూర్వీకులు ఎందుకు పశువులు కాస్తూ బతకవలసి వచ్చిందోనని ఆలోచింపజేసేదిలా ఆధునిక నాటకం కుండబద్దలు కొట్టిందని తెలిపారు.
ఈ 150 ఏండ్ల కాలంలో యావత్‌ భారతదేశంలో భాగంగానే తెలుగునాట కూడా మూఢభక్తి ఛాందసత్వాన్ని దాటుకుని సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్రోద్యమాలు, ప్రగతిశీల ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఉద్యమాలు, నాటకాలు పరస్పర ప్రభావితాలు. పరస్పర ఆధారితాలు. చలనశీలమైన ఈ ద్వి అంశాలు నాటకం – జీవితం మాదిరి కలగలిసే వుంటాయి. వేరు చేయలేం. తెలుగునాటకం అనివార్యంగా ఆ ప్రజా ఉద్యమాల్లో అంతర్భాగమైంది. ప్రతి నాటకకర్త విషయంలో ఈ ఉద్యమ పార్శ్వం ఏదో ఓ రూపేణా ద్యోతకమవుతూనే వుంటుంది.
పాఠకుల సౌలభ్యం కోసం పుస్తకాన్ని రెండుగా వింగడించి, మొదటి భాగంలో 116 మంది రచయితల విశేషాలను, రెండవ భాగంలో 123 మంది నటుల, దర్శకుల, ఇతరుల విశేషాలను పొందుపరిచారు.
దివంగతులైన నాటకరంగ ప్రముఖుల జీవిత విశేషాలను ప్రతిభా పాటవాలను తెలపడం ఈనాటి తరానికీ, భవిష్యత్‌ తరానికీ ఎంతో ఉపయుక్తంగా వుంటుందని డా||కె.వి.రమణాచారి ‘నానుడి’లో పేర్కొనడం ముదావహం. నిజంగానే వారన్నట్లు ఆ మహనీయులకు ఇదో నీరాజనం.
నాటక రచయితల తొలిభాగంలో కోరాడ రామచంద్రశాస్త్రి నుండి ఇటీవల మరణించిన యువ రచయిత గంధం నాగరాజు వరకు, మలిభాగంలో సురభి పాపాబాయి నుండి నేరెళ్ల వేణుమాధవ్‌ వరకు (నటులు, దర్శకులు, ఇతర ప్రముఖులు) వున్నారు. 1/4 డమ్మీ సైజులో దాదాపు వేయి పుటలు నిండైన చిత్తరువులతో అపురూప విశేషాలతో, ఓ విజ్ఞాన సర్వస్వంలా రూపుదిద్దుకున్న ఉధ్గ్రంధమిది.
ఇంతటి భారీయత్నంలో పొరపాట్లు దొర్లక మానవు. గోవిందరాజుల సుబ్బారవు, అవేటిపూర్ణిమ (వనారస గోవిందరావు కుమార్తె), కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులకు ఈ గ్రంథంలో చోటు దక్కలేదని విమర్శలు వచ్చాయి. సహేతుకంగా వాటిని స్వీకరించి, అనుబంధ ప్రచురణల్లో జత చేసుకోవడం మంచిది. ఇలాంటి పరిశోధనలకు ఆరంభమూ, కొనసాగింపే తప్ప అంతం వుండదు కదా.
-కె.శాంతారావు 9959745723

Spread the love