Tuesday, August 18, 2026
E-PAPER
Homeక్రైమ్బాలాపూర్‌లో దారుణం.. యువతి హత్య

బాలాపూర్‌లో దారుణం.. యువతి హత్య

- Advertisement -

మృతదేహాన్ని గోనె సంచిలో కట్టిన యువకుడు
నిందితుడి కోసం గాలింపు
నవతెలంగాణ–బడంగ్‌పేట్‌

​రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన యువతిని ప్రియుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌రెడ్డి, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌తో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బిస్మిల్లా కాలనీకి చెందిన అహ్మద్‌ సలాం ఓ ఫంక్షన్‌ హాల్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన రెహానా (21)తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంత కాలంగా వీరిద్దరూ బిస్మిల్లా కాలనీలోని అహ్మద్‌ సలాం ఇంట్లో సహజీవనం చేశారు. అయితే యువతి తనను పెండ్లి చేసుకోవాలని సలాంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆదివారం అర్ధరాత్రి ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సలాం కత్తితో రెహానాపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు గోనె సంచిలో మూటక ట్టాడు. ఈ ఘటనలో తనకు సహకరించాలని కొందరిని కోరగా వారు నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్ల వారుజామున 5 గంటల సమయంలో డయల్‌–100కు సమాచారం అందడంతో ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -