వారిపై పని భారం తగ్గించాలి
కార్మిక చట్టాలు అమలు చేయాలి :
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టెక్ మహీంద్రా ఐటీ కంపెనీ ఉద్యోగి భావనా శర్మపై అధికారుల వేధింపులు అరికట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఐటీ ఉద్యోగుల ‘దీక్షా’ శిబిరాన్ని భాస్కర్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ టెక్ మహీంద్రా ఉద్యోగి భావనాశర్మపై వివక్ష ప్రదర్శించిన ఆ కంపెనీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు. వెంటనే కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలని, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు బాధిత ఉద్యోగులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500 ఐటీ కంపెనీల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని చెప్పారు. దీన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను కేవలం ఒకరిద్దరు ఐటీ ఉద్యోగుల సమస్యగా చూడకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌ల ప్రభావం ఐటీ ఉద్యోగులతో పాటు అందరి హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తే రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జె. వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఐటి, ఐటి ఆధారిత సర్వీసెస్ ఉద్యోగులంతా సంఘటితమై ఐటీ పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే యాజమాన్యాలు, ప్రభుత్వాల మెడల వంచి హక్కులు సాధించుకోగలమని తెలిపారు.
ఐటీ ఉద్యోగిపై అధికారుల వేధింపులు అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



