వార్నర్‌కు ఘన వీడ్కోలు.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

నవతెలంగాణ – సిడ్నీ  : సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  తన ఫేర్‌వెల్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్‌.. తన కెరీర్‌ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ విజయానికి చేరువైన సమయంలో పాక్‌ స్పిన్నర్‌  సాజిద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్‌ ఆటగాళ్లు వార్నర్‌ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన వార్నర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్‌ కన్నీరు పెట్టుకున్నాడు. “విజయంతో నా కెరీర్‌ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్‌ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా,  ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను.కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని”వార్నర్‌ పేర్కొన్నాడు.తన టెస్టు కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్‌ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి.

Spread the love