విమానాలకు నో సిగ్నల్స్‌ … కారణం చూస్తే భారీ క్రెయిన్‌..!

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్‌ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్‌ కారణంగా … దాదాపు 100 విమానాలకు ఇబ్బందులెదురయ్యాయి. కొన్ని విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ అయితే… మరికొన్నిటిని ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే … ఢిల్లీ-జైపూర్‌ నేషనల్‌ హైవేకు అనుసంధానించే అర్బన్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్‌ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్‌హెచ్‌ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది. ఈక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు విధినిర్వహణలో భాగంగా … రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్‌ రన్‌వే సమీపంలో ఒక పొడవాటి క్రెయిన్‌ను ఉంచారు. ఈ క్రెయిన్‌ కారణంగా, విమానాలకు ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఎస్‌) సిగ్నల్‌ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. అలాంటి సందర్భాల్లో వాటి సేఫ్‌ ల్యాండింగ్‌కు ఐఎల్‌ఎస్‌ సిగ్నల్‌ నావిగేషన్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రేన్‌ కారణంగా విమానాలకు సిగ్నల్స్‌ సరిగా అందకపోవడంతో 100 విమానాల వరకు గతవారం రోజులుగా ఆలస్యంగా ల్యాండ్‌ అవుతున్నాయి. కొన్నిటిని ఏకంగా దారి మళ్లించాల్సి వస్తుంది. ” ఐఎల్‌ఎస్‌ సిగల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్‌ లైన్‌ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్‌ అయ్యాయి ” అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. క్రెయిన్‌ కారణంగా విమానాలకు సిగ్నల్స్‌ అందడం లేదని నిర్థారించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు.

Spread the love