నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయనున్న ఈడీ..?

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు. గురువారం ఉదయం ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోనుందంటూ ఆప్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందంటూ పార్టీ నాయకులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌, జాస్మిన్‌ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెళ్లడించారు. గురువారం ఉదయం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని వార్తలు వస్తున్నాయి. అ సందర్భంగా సీఎంను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంత్రి అతిశి ట్వీట్‌ చేశారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌.. ఉదయం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై దాడి చేయనున్నట్లు ఈడీ వర్గాలు దృవీకరించాయి. అరెస్టు చేసే అవకాశం ఉంది’ అని షా రాసుకొచ్చారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈడీ ఆయన ఇంటికి వెళ్లనుందంటూ భరద్వాజ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లే రోడ్లను ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆయన అరెస్టుపై తమ అనుమానాలకు బలం చేకూరిందంటూ పార్టీ నాయకులు అంటున్నారు. కాగా, ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన.. మూడోసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Spread the love