తెలంగాణలో నెలాఖరు కల్లా మరో హామీ అమలు

నవతెలంగాణ- హైదరాబాద్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై సంతకం చేశారు. ఇందులో మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరో గ్యారంటీ అయిన చేయూతలో రూ.10 లక్షలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కిందనే ప్రతినెలా మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు సమాచారం.

Spread the love