– వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో నిర్వహణ
– హాజరైన డాక్టర్ అర్షియ
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో వీధి కుక్కల కాటు నివారణ, జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అర్షియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీధి కుక్కలు లేదా దూకుడుగా ప్రవర్తించే కుక్కలు ఎదురైనప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.కుక్క కాటుకు గురైన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడగడం,ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం,అవసరమైన యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవడం వంటి అంశాలపై ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి లక్షణాలను గమనించాలనే విషయాలను వివరించారు.
అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఆన్‌లైన్ వేదిక ద్వారా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (వ్యసన రహిత భారతదేశం) ప్రతిజ్ఞ చేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ఎ. శ్రీజన్, శ్రీమతి డి. శ్రవంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



