నవతెలంగాణ – ఆలేరు రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ సోమేశ్వరాలయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు జి.ఎం. సోమయ్య, గంగాధర్, చంద్రశేఖర్ మంత్రికి ఆలయ తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.
మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కాలభైరవ స్వామి, పంచముఖ బ్రహ్మ, దుర్గమ్మ, కోటొక్క లింగం దేవాలయాలను సందర్శించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం,మ్యూజియాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.ఆలయ ప్రస్తుత పరిస్థితులు,అభివృద్ధి అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.కొలనుపాకను సమగ్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ఆలయ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



