నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని 38వ వార్డులో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ( లోకల్ బాడీ ) గిరి లు పాల్గొని ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటరు జాబితా వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే అవసరమైన మార్పులు, సవరణలు చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎస్‌ఐఆర్ పత్రాలు నింపే సమయంలో జరిగిన పొరపాట్లు, ఓటరు జాబితాలో వివరాల నమోదులో తలెత్తిన సమస్యల కారణంగా కొంతమంది అర్హులైన ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. అలాంటి వారికి బీఎల్‌ఓలు నోటీసులు అందించినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గుర్తించిన 16 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును తీసుకెళ్లి సంబంధిత అధికారులకు చూపించి తమ ఓటు వివరాలను సరిచేసుకోవచ్చని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటును అనవసరంగా తొలగించబోమని, ప్రతి ఓటరుకు తమ వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుందని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికాకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టీపీబీఓ సాయి కిరణ్, కో-ఆప్షన్ సభ్యురాలు గొనె సునీత శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, బీసీ సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు, నాయకులు అమీర్, మంద రాములు, వేణు, సోహిల్, రమేష్, రఘు, స్థానిక ప్రజలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



