సమస్యలను అధిగమించేందుకు అవగాహన కల్పించాలి

–  ప్రజా పాలన సేవా కేంద్రాల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేయాలి
– రంజాన్ దృష్ట్యా గ్యాస్ కొరతా లేకుండా చూడాలి 
– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
 నవ తెలంగాణ నల్గొండ కలెక్టరేట్
మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీపై ఎల్పిజి గ్యాస్ పొందేందుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రజా పాలన సేవా కేంద్రాల వద్ద వినియోగదారులకు అవగాహన కల్పించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీపై ఎల్పీజీ గ్యాస్ పొందే వినియోగదారులకు ఏర్పడుతున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించే విషయమై పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, సేల్స్ మెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద  సబ్సిడీ గ్యాస్ పొందేందుకు  వినియోగదారులు వారి పూర్తి వివరాలను అప్డేట్ చేసుకోవలసి ఉండగా, డేటా మ్యాచ్ కాకపోవడం, ఆధార్ కార్డు అప్డేట్ కాకపోవడం, ఈకే వైసి బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలవల్ల డేటా అప్ డేట్ చేయలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల ఈ విషయంలో లబ్ధిదారులకు పూర్తిగా ఈ అంశాలపై అవగాహన కలిగే విధంగా అన్ని ప్రజాపాలన సేవా కేంద్రాల వద్ద వారికి అర్థమయ్యే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఎల్పీజీ గ్యాస్ డీలర్లకు సూచించారు. ఎల్పిజి గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ సిలిండర్ పై ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించాలని, ఎల్పిజి గ్యాస్ డీలర్లు సైతం ఎల్పిజి గ్యాస్ డెలివరీ బాయ్స్ కు ఎక్కువ డబ్బులు వసూలు చేయవద్దని చెప్పాలని ఆదేశించారు.  రంజాన్ సందర్భంగా గ్యాస్ డీలర్లు స్టాక్ ను సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైతే సెలవు రోజుల్లో సైతం గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, డిప్యూటీ తహసిల్దార్ విజయ, సివిల్ సప్లై సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love