బీఆర్‌ఎస్‌లోకి బాబూ మోహన్‌ తనయుడు

బీఆర్‌ఎస్‌లోకి బాబూ మోహన్‌ తనయుడు– మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరిక
నవతెలంగాణ-జోగిపేట
సంగారెడ్డి జిల్లా అందోల్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి పి. బాబుమోహన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆయన తనయుడు ఉదరు తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బీజేపీ అందోల్‌ మండలాధ్యక్షులు నవీన్‌కుమార్‌, ఉమ్మడి పుల్కల్‌ మండలాధ్యక్షులు శేఖర్‌గౌడ్‌, జోగిపేట పట్టణాధ్యక్షులు సయ్య సాయి, బీజేవైఎం నాయకులు రవికిరణ్‌, సాయికుమార్‌, ఎస్సీ మోర్చా నాయకులు రాకేష్‌, నాయకులు లక్ష్మణ్‌, అర్జున్‌, రాములు, లడ్డు తదితరులు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీ నేత, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బాలయ్య తన అనుచరులతో ఇదివరకే బీఆర్‌ఎస్‌లో చేరారు. దాంతో అందోల్‌లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఉదరు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బలోపేతానికి తామంతా కృషి చేస్తామని, అందోల్‌తోపాటు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రానున్నదన్నారు. మూడోసారి కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మఠం బిక్షపతి, పార్టీ సీనియర్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, కాశీనాథ్‌ తదితరులు ఉన్నారు.

Spread the love