– బడుల బలోపేతానికి 19 వరకు కార్యక్రమాలు
– బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యం
– విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక
– అంగన్‌వాడీల్లో 5 ఏండ్లు నిండిన పిల్లలు సర్కార్ బడులకు..
– ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో ప్రచారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 19వ తేదీ దాకా జయ శంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడి బయట ఉన్న బడిఈడు పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, మరమ్మతుల పనులతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన తల్లిదండ్రులకు వివరిస్తూ వారి పిల్లలను బడుల్లో చేర్పించడం, బాలికా విద్యా అవసరాన్ని వివరిస్తూ ఆడపిల్లలు, తల్లిదండ్రులను చైతన్య పరచడమే లక్ష్యంగా 12 రోజుల పాటు జంటనగరాల్లో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్ని అవాస పాంత్రాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించడం, వారి తల్లిదండ్రుల తో మాట్లాడడం, బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయనున్నారు. ఇదిలావుంటే తొలుత జూన్ 3-19 వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. కానీ ఎండల తీవ్రత దృష్ట్యా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో విద్యాశాఖ మరోమారు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో బడిబాట కార్యక్రమం ఈనెల 3 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు నిర్వహించనున్నారు.
పథకాల వివరాలతో కూడిన ప్రొఫైల్..
పాఠశాల ప్రధాననోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల యాజమాన్య కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి 7నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా ఇచ్చే ఆర్యోగ కిట్ల పంపిణీ, మౌలిక వసతులు, మధ్యాహ్నా భోజనం పథకం, పాఠ్యపుస్తకాల, యూనీఫాం, ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్ వంటి వాటి వివరాలతో కూడిన ప్రొఫైల్ తయారు చేసు కోవాల్సింది. వాటిని కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అందరికీ తెలియజేసే విధంగా బడిబాట ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలి. స్వయం సహాయక మహిళా సంఘాల భాగస్వామ్యంతో బడీడు పిల్లలను గుర్తిం చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది. పాఠశాల పున:ప్రారంభం నాటికి పాఠశాల ప్రాంగణం, తాగునీరు, గదులు, టాయిలెట్లు, డిజిటల్ తరగతులు, లాబోరేటరీ, లైబ్రరీ అన్ని వినియోగంలో ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలి.
లక్ష్యాలు ఇవీ..
అన్ని అవాస ప్రాంతాల్లో బడిఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ప్రధానం. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతిని పూర్తి చేసిన పిల్లలను ప్రాథమికోన్నత పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాల పూర్తయిన పిల్లలను ఉన్నత పాఠశాలలో చేర్పించే విధంగా 100 శాతం కృషి చేయాలి. తక్కువ శాతం విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించి సంఖ్యను పెంచి వాటిని బలోపేతానికి చర్యలు చేపట్టాలి. బాలికా విద్యా ప్రాధాన్యతను తెలియజేసి బడిలో చేర్పించాలి.
మొదటి రోజు: అన్ని మండలాల్లో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు, ఎస్‌హెచ్‌జీ, ఏఏపీసీలతో సమా వేశం ఏర్పాటు చేసి ‘బడిబాట’ గురించి చర్చించి ప్రతిజ్ఞ చేయించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, తల్లిదం డ్రులను భాగస్వాములుగా చేయడం.
రెండవ రోజు : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చొరవతో ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీతో పాటు బడీడు పిల్లలను గుర్తించి చేర్పించడంతో పాటు విద్యారిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలి.
8 నుంచి పదో తేదీ వరకు: రోజూ అన్ని అవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయాలి. బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలి. నమోదైన పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనీఫామ్‌లు అందజేయాలి. తల్లిదం డ్రులకు పాఠశాల ప్రాధాన్యతను తెలియజేయాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించడం, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రచారం చేయడం, బాలకార్మికుల విముక్తి కలిగించి బడిలో చేర్పించడం, రోజువారీ బడిబాట వివరాలను మండల విద్యాధికారి ద్వారా బడిబాట డెస్క్‌కు ప్రతిరోజూ 3గంటలకు అందించాల్సి ఉంటుంది.
11వ తేదీన: మండల స్థాయి సమావేశం నిర్వహించి 6 నుంచి 10వ తేది వరకు నిర్వహించిన కార్యక్రమాలపై చర్చించడం. గుర్తించిన పిల్లలను 12వ తేదిన పాఠశాలకు వచ్చేలా చూడడం.
12 నుంచి19 తేదీ వరకు: పాఠశాలలో స్వాగత దినోత్సవం నిర్వహించి రెడీనెస్ కార్యక్రమం చేపట్టడం, బడిలో పండుగ వాతావరణం కల్పించి విద్యార్థులకు స్వాగతం పలకడం.
13న తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్), ఎల్‌ఐపీ డే నిర్వహణ. 14న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బడి ప్రాధాన్యత, చదువు విశిష్టత తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. నూతనంగా నమోదైన పిల్లలు, వారి తల్లిదండ్రులతో హాజరయ్యేలా చూసి సమావేశం ఏర్పాటు చేయాలి. అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిన ముందుగానే సమాకూర్చుకోవాలి. ఉన్నత పాఠశాలలో బాలసభ సమావేశం నిర్వహించాలి. 15న బాలికా దినోత్సవాన్ని నిర్వహించడం. 18న డిజిటల్ తరగతులపై అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం.19న క్రీడా దినోత్సవం నిర్వహించడం.