సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులను రోడ్ల మీద తిరగనివ్వం
వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు
నవతెలంగాణ-ఆలేరు టౌన్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుంటే, రాష్ట్ర మంత్రులను రోడ్ల మీద తిరగనివ్వమని, వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని పి.డి.ఎస్.యూ. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.ఉదయ్, ఎస్.ఎఫ్.ఐ. జిల్లా ఉపాధ్యక్షులు కాసుల నరేష్, ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకులు కందుల మధు, పి.వై.ఎల్. రాష్ట్ర కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు.
బంద్ అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటివరకు విద్యారంగంలో ఉన్న సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కెసిఆర్ ప్రభుత్వాన్ని తిట్టి విద్యార్థులకు నేను న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో విద్యార్థులకు చేసింది ఏదీ లేదని ఎండగట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల సర్కారు బడులను 4 వేలకు కుదించి, పేద విద్యార్థులు కూడా ప్రయివేటు బడులకు వెళ్ళేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఈఓ, డిఈఓ పోస్టులను, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న రూ.10,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని, కొత్త జీఓల పేరుతో విద్యార్థులను మోసం చేసే ఆలోచనలు మాని వెంటనే స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేట్ స్కూళ్లను కేటగిరీలుగా విభజించి ఫీజులను నియంత్రించాలని, విచ్చలవిడిగా కార్పొరేట్ స్కూల్ లకు ఇస్తున్న అనుమతులను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని, మొత్తం మధ్యాహ్న భోజన పథకాలని ప్రైవేట్ సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పజెప్పాలని ఏకరువుపట్టారు.
ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను రోడ్ల మీదికి రాకుండా అడ్డుకుంటామని, గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్ పాలకులకు కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడాల ప్రవీణ్, ఎస్.ఎఫ్.ఐ. మండల అధ్యక్షుడు మద్దెల సాయి, ఎం.డి. లతీఫ్,గణేష్, పి.డి.ఎస్.యూ. జిల్లా నాయకులు ప్రణయ్, మహేష్, చందు, చరణ్, లవన్, బన్నీ, కిరణ్, భాను తదితరులు పాల్గొన్నారు.



