మహబూబ్‌నగర్ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బర్రెలక్కగా సుపరిచితురాలైన యువతి శిరీష రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఒక తెలంగాణ నిరుద్యోగినిగా నామినేషన్ వేశాను. నేను ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోవచ్చు. డబ్బు పంచలేకపోవచ్చు. కానీ ఓటర్లైన ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించాలి. నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన శిరీష ఉద్యోగ నోటిఫికేషన్లు లేక పశుపోషణ వైపు మళ్లారు. తల్లి వద్ద కొంత డబ్బు తీసుకుని బర్రెలను కొనుగోలు చేశారు. ఆ తరువాత కంటెంట్ క్రియేటర్‌గా మారారు. ‘హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కని’ అంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టే వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.

Spread the love