మారణహోమం వెనుక..!

Behind the carnage..!– గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని గ్యాస్‌, చమురు నిక్షేపాలపై కన్ను
– అందుకే కయ్యానికి కాలుదువ్విన ఇజ్రాయిల్‌
గాజా స్ట్రిప్‌ : గాజాలోనూ, వెస్ట్‌బ్యాంక్‌లోనూ అపారమైన గ్యాస్‌, చమురు నిక్షేపాలు ఉన్నాయి. వీటి పైన కన్నేసిన ఇజ్రాయిల్‌ ఆ ప్రాంతాలపై భీకర దాడులు జరుపుతోంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో… ముఖ్యంగా ఇజ్రాయిల్‌కు చెందిన జోర్హ్‌ బేసిన్‌ సమీపంలో 3.4 ట్రిలియన్‌(లక్ష కోట్లు) క్యూబిక్‌ మీటర్ల (టీసీఎం) గ్యాస్‌ ఉన్నదని 2010లోనే అమెరికా భూగర్భ విభాగం ఓ సర్వేలో తెలిపింది. పాలస్తీనా అథారిటీ అభ్యర్థన మేరకు బ్రిటీష్‌ గ్యాస్‌ కంపెనీ 2000వ సంవత్సరంలో అన్వేషణ జరిపింది. అక్కడ 20 బిలియన్‌ (వందకోట్లు) క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని గుర్తించింది. ఆ ప్రాంతంలో 45 బీసీఎంల గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని అమెరికా ఇంధన సమాచార విభాగం అంచనా వేసింది. గాజా తీరంలో సుమారు 30-45 బీసీఎంల గ్యాస్‌ నిల్వలు ఉన్నాయి.
ఇక చమురుకు సంబంధించి వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సదస్సు చాలా విలువైన సమాచారాన్ని అందజేసింది. ఈ సదస్సు నివేదిక ప్రకారం ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో 1,525 బిలియన్‌ బ్యారల్స్‌ చమురు నిల్వలు ఉన్నాయి. ఇతర క్షేత్రాలతో పోలిస్తే గ్యాస్‌ నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ చమురు నిల్వలు మాత్రం గణనీయంగానే ఉన్నాయి. టర్కీ దేశం ఏటా సగటున 58-60 టీసీఎంల గ్యాస్‌ను వినియోగిస్తుంది. గాజా చమురు క్షేత్రాల్లో కనుగొన్న గ్యాస్‌ నిల్వలు ఆరు నెలల పాటు టర్కీ అవసరాలు తీరుస్తాయి.
సవాళ్లు…విభేదాలు
సముద్ర పరిధి విషయంలో తూర్పు మధ్యధరా ప్రాంతంలోని దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే వాటి ఇంధన సామర్ధ్యం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో టర్కీ-సైప్రస్‌ (టీఆర్‌ఎన్‌సీ), గ్రీస్‌-టర్కీ, ఇజ్రాయిల్‌-లెబనాన్‌, ఇజ్రాయిల్‌-పాలస్తీనా మధ్య విభేదాలు పొడసూపాయి. విభేదాలపై చర్చించి, వాటిని పరిష్కరించుకునేందుకు ఈ దేశాలు తమ పరిశీలకులతో కలిసి తూర్పు మధ్యధరా ఫోరంలో చర్చలు జరుపుతున్నాయి. టర్కీ ఆలస్యంగా వచ్చి సంప్రదింపుల్లో భాగస్వామి అయింది. లెబనాన్‌, టర్కీ దేశాలు ఫోరం చర్చల్లో సరిగా పాల్గొనకపోవడంతో సమస్య పరిష్కారానికి అవరోధం ఏర్పడింది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో అనేక సవాళ్లు ఉన్నాయి. తరచుగా అక్కడ ఘర్షణలు జరుగుతుంటాయి. ఇలాంటి వాతావరణంలో గాజా తీరం నుండి గ్యాస్‌, చమురు నిక్షేపాలను వెలికితీయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో గాజా సముద్ర క్షేత్రాల నుండి గ్యాస్‌, చమురును వెలికితీయడం సాధ్యమేనని చెప్పవచ్చు. కాకుంటే అక్కడి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా వనరుల ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయి. ఫలితంగా ఇంధన ఉత్పత్తి సాధ్యం కావడం లేదు.
1948 నుండే ఘర్షణలు
ఇజ్రాయిల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయిల్‌ ఏర్పడినప్పటి నుండే ఇవి కొనసాగుతున్నాయి. తరచుగా జరిగిన ఘర్షణలు చివరికి పూర్తి స్థాయి యుద్ధాలుగా రూపాంతరం చెందాయి. దీంతో ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ముప్పు పెరిగింది. గాజా క్షేత్రంలో కార్యకలాపాలు సాగించాలని అనుకునే ఇంధన కంపెనీలు పరికరాలు, సిబ్బంది రక్షణ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న కంపెనీలు బీమా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాయి. అయితే గాజాలో బీమా ఖర్చు గ్యాస్‌ ఉత్పత్తి లాభాల కంటే రెట్టింపు, కొన్ని సందర్భాల్లో మూడు రెట్లు కూడా అవుతోంది. అయినా బీమా కంపెనీలు ఇజ్రాయిల్‌ దాడులపై ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. హమాస్‌ దాడుల తర్వాత తమర్‌ క్షేత్రంలో ఇజాయ్రిల్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. ఘర్షణ ప్రమాదానికి ఇదో ఉదాహరణ.
ఒప్పందం అసాధ్యమే
పాలస్తీనా ఇంధన అవసరాలు తీరాలంటే గాజాలోని చమురు వనరులు ఎంతో కీలకం. అయితే వాటిని వెలికితీయాలంటే ఇజ్రాయిల్‌తో రాజీ పడక తప్పని పరిస్థితి. ఉత్పత్తి నిలిపివేతకు బ్రిటీష్‌ గ్యాస్‌ కంపెనీ 2000వ సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది. గ్యాస్‌, చమురు తవ్వకాలపై ఇజ్రాయిల్‌, పాలస్తీనా తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. సమీప భవిష్యత్తులో కుదిరే అవకాశాలూ కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి వనరులు, ఉత్పత్తిపై పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది.
నిల్వలు ఉన్నా…
1999 నుండి తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఇజ్రాయిల్‌ గ్యాస్‌ నిక్షేపాలను అన్వేషిస్తూనే ఉంది. 1999లో ఆ ప్రక్రియ ఊపందుకుంది. ఆ ఏడాది అష్‌దాద్‌ ఓడరేవు సమీపంలో ఓ చిన్నపాటి సహజ వాయువు నిల్వ కన్పించింది. 2009లో హైఫా తీరంలో 260 బీసీఎంల గ్యాస్‌ను కనుగొన్నారు. ఓ సంవత్సరం తర్వాత లెవియాథన్‌ క్షేత్రంలో 600 బీసీఎంల గ్యాస్‌ (18 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులు) నిల్వలు కన్పించాయి. 2019లో ఎనర్జియన్‌ చమురు-గ్యాస్‌ కంపెనీ కరిష్‌, తనిన్‌ క్షేత్రాల్లో 68 బీసీఎంల గ్యాస్‌ను, 34 మిలియన్‌ బ్యారల్స్‌ తేలికపాటి చమురును కనుగొంది. ఇజ్రాయిల్‌ వద్ద 700 బీసీఎంల గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని ఈఐఏ సమాచారం ధృవీకరించింది. ఇటీవలి కాలంలో కనుగొన్న నిక్షేపాలతో కలిపి ఇది 750 బీసీఎంలకు చేరిందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు ఆ దేశం వద్ద 50 మిలియన్‌ బ్యారల్స్‌ చమురు కూడా ఉంది.
2000వ సంవత్సరం నుండి ఈ క్షేత్రాల్లో ఇజ్రాయిల్‌ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం 2022లో ఇజ్రాయిల్‌ గ్యాస్‌ ఉత్పత్తి 21.9 బీసీఎంలు. దేశీయంగా 11.5 బీసీఎంల వినియోగం జరుగుతోంది. మిగిలిన నిల్వల్ని జోర్డాన్‌, ఈజిప్ట్‌ కొనుగోలు చేస్తున్నాయి. ఈజిప్ట్‌ కొనుగోళ్లు గత సంవత్సరం 48.5% పెరిగాయి. ఇజ్రాయిల్‌ వద్ద రష్యా, ఇరాన్‌, ఖతార్‌ వద్ద ఉన్నన్ని గ్యాస్‌ నిల్వలు లేనప్పటికీ పాలస్తీనాతో జరుగుతున్న ఘర్షణను పరిగణనలోకి తీసుకుంటే దాని వద్ద నిల్వలు గణనీయంగానే ఉన్నాయని చెప్పాలి.
ఇజ్రాయిల్‌ లక్ష్యం అదే
గ్యాస్‌ ఉత్పత్తిని పెంచుకోవాలన్న ఇజ్రాయిల్‌ లక్ష్యమే యుద్ధానికి దారితీసింది. లక్షలాది పాలస్తీనా ప్రజలు నిరాశ్రయులవ్వడానికి కారణమైంది. గ్యాస్‌, చమురు కోసం ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణహోమం పాలస్తీనా ప్రజల హక్కులను కాలరాస్తోంది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరుసలేంపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలన్నది ఇజ్రాయిల్‌ ఆకాంక్ష. ముందుగా గాజాపై పట్టు బిగించి, ఆ తర్వాత అక్కడి గ్యాస్‌ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఇజ్రాయిల్‌ భావిస్తోంది.

Spread the love