రాష్ట్రంలో బెల్ట్ షాపులను రద్దు చేయాలి

– ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి
– పిల్లల్లో మానసిక అశాంతికి కారణమవుతున్న మద్యంను నియంత్రించాలి
– మద్యం నియంత్రణతో పిల్లల్లో విద్యాభివృద్ధికి దోహదం చేయాలి
– జి.ఓ.317 బాధితులకు న్యాయం చేయాలి
– టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి పి.విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
 రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను మూసివేసి, గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల టీపీటీఫ్ మండల అధ్యక్షులు జి. బాలు అధ్యక్షతన రత్తిరాం తండాలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా  శ్రీశైలం హాజరై శుక్రవారం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులలో నిత్యం మద్యం అందుబాటులో ఉండడం వల్ల ప్రజల్లో లేని ఆలోచనను కల్గిస్తున్నారని అన్నారు. ఊరికొక బడి లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం వీధికొకటి ఉన్నాయని అన్నారు.  దీనివల్ల పిల్లల భవిష్యత్తుపై కాకుండా మద్యంపై తమ డబ్బును, సమయాన్ని వెచ్చిస్తున్నారని, ఇది తెలంగాణ పునర్నిర్మాణానికి విఘాతం కాగలదని గుర్తుంచుకోవాలని అన్నారు. మద్యం తాగడం వల్ల కుటుంబాల్లో వస్తున్న గొడవలు పిల్లలను మానసిక అలజడికి గురిచేసి చదువులో వెనకపడేలా చేస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రుల మధ్య తగాదాల వల్ల పిల్లలు దీర్ఘకాలం గైర్హాజరవుతున్నారని, తాగి తాగి కుటుంబ పెద్ద మరణిస్తే పూర్తిగా విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, చైతన్యవంతమైన భవిష్యత్తు సమాజం కోసం మద్యo నియంత్రణ చేయాలని, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
 మరో అతిథి జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, సామర్ధ్యాల పెంపు పేరుతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను నిలుపుదల చేయాలని, విద్యాశాఖపై అనధికార వ్యక్తుల పెత్తనాన్ని నిలువరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వాగ్దానం ప్రకారం జి.ఓ.317 బాధితులకు న్యాయం చేయాలని, నెలలు, సంవత్సరాల తరబడి పెండింగులో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సైదుల్ పాషా, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కె.భిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్, కమిటీ సభ్యులు కె.పద్మావతి, ఉదయ్, రవి,రాజు, గోవర్ధన్,ప్రవీణ్ కుమార్, సమ్మె రాజు,రవి, గోవర్ధన్, సత్యనారాయణ, కే.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love