రకరకాల రోగాలతో ప్రజలు అల్లాడుతున్న ఈ కాలంలో ఆస్పత్రులు కిటకిట, మందులు కటకట, సామాన్యుడి జీవితం అయ్యో.. అక్కట! ఇలాంటి స్థితిలో మనకు డాక్టర్లు, మందుల షాపులు మాత్రమే తెలుసు. కానీ ఆ మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీలోనే పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు అందుకున్న దేశెట్టి ఐశ్వర్య గురించి తెలుసుకుంటే ఆరంగంపై యువతకి ఆసక్తి, అనురక్తి పెరుగుతుంది.
చదువుతోపాటు ఆటల్లోనూ
విజయలక్ష్మి బాబూరావు దంపతుల కూతురు ఐశ్వర్య. బి.ఫార్మసీ, ఎం.బి.ఎ.చేసిన ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో పేరెగ్జల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు. భర్త శ్రీ.ఎల్.ఎస్.ఎన్.కుమార్ కూడా ఫార్మాకంపెనీలో మేనేజర్. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. వీరి ఏకైక కుమారుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇక ఐశ్వర్య ఎనిమిదవ తరగతి వరకు పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో చదివారు. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించేవారు. కబడీ, ఖోఖో, త్రోబాల్ లో లెక్కలేనన్ని బహుమతులు పొందారు.
బెస్ట్ ఎంప్లాయ్
కూతురు డాక్టర్ కావాలని ఐశ్వర్య తల్లిదండ్రులు ఎంతో కోరుకున్నారు. వారి కోరిక తీర్చలేకపోయినా ఆమె ఫార్మా రంగంలో రాణించటంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. గుంటూరులోని వికాస్ కాలేజీలో ఇంటర్ మంచిమార్కులతో పాసైన ఐశ్వర్య ఆర్ధిక ఇబ్బందుల వల్ల బి.ఫార్మసీ చదివి బెంగుళూరులో క్లినికల్ రిసెర్చ్ కోర్సు చేశారు. అక్కడ ట్యూటర్ గా కొన్నాళ్లు పనిచేసి చెన్నై లోని ఓ కంపెనీలో చేరి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నారు. పెండ్లి తర్వాత భర్తతో హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆమె మూడు సార్లు బెస్ట్ ఎంప్లాయ్‌గా అవార్డులు పొందటం ఓవిశేషం. ఓ తల్లిగా, భార్యగా, కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే స్వశక్తితో చేస్తున్న ఉద్యోగంలో రాణిస్తున్నారు.
సామాజిక సేవలోనూ…
ఉద్యోగంతో పాటు ఐశ్వర్య అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. జనం నుండి వచ్చే ఫిర్యాదులను ఓ ఫార్మాసిస్ట్ ప్రభుత్వానికి తెలియజేస్తారు. మందుల గూర్చి అందరికీ అవగాహన కలిగిస్తూనే అనాధాశ్రమాలకు, పేదపిల్లలకు చేయూత నందిస్తున్న సామాజిక సేవకురాలు ఆమె. తల్లిదండ్రుల ద్వారా ఆమె చిన్నతనం నుండే సామాజానికి సేవ చేయాలనే దృక్పథంతో పెరిగారు. అదే ఆమెను నేడు ఓ సామాజిక సేవకురాలిగా తీర్చిదిద్దింది. చదివిన చదువుకు సార్ధకత కలిగిస్తూ సాధారణ ప్రజలకు మందులపై అవగాహన కలిగిస్తున్న ఆమె నేటి యువతకి ఆదర్శం అనటంలో ఏమాత్రం సందేహం లేదు
అచ్యుతుని రాజ్యశ్రీ



