టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వంటి ప్రచార సాధనాలు ఏవీ లేవు. రేడియో బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయినా ఉరితీసిన కొద్ది గంటల్లోనే ఆ సమాచారం దేశమంతా దావానలంలా వ్యాపించింది. ప్రజల్లో ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకొంది. లహోర్‌కు వేలమైళ్ల దూరంలో ఉన్న మద్రాసు నగరంలోనూ ప్రజలు రాత్రికిరాత్రే వీధుల్లోకి వచ్చారు. పెద్ద నిరసన ప్రదర్శన చేశారు. అప్పటికి బాలుడిగా ఉండిన తమిళనాడు సిపిఎం నాయకుడు ఎన్. శంకరయ్య తన జ్ఞాపకాల్లో ఆనాటి ప్రజా ప్రతిస్పందనను వివరిస్తూ ”మద్రాసు నగరంలో ఉన్నట్లుండి ఏదో కల్లోలం జరిగినట్లు జనం స్పందించారు. ఎవరి పిలుపూ లేకుండానే ప్రజలు తమ ఇళ్లలోంచి వీధుల్లోకి వచ్చారు. భగత్‌సింగ్ త్రయం ఉరితీతను, బ్రిటిష్ పాలనను నిరసిస్తూ ఏ వీధికి ఆ వీధిలో చిన్న చిన్న పాయలుగా మొదలైన ప్రదర్శనలు మహాప్రదర్శనగా మారి మద్రాసును కుదిపేసాయి” అని చెప్పారు. వంటిపై చొక్కా కూడా ధరించకుండా వీధుల్లోకి పరిగెత్తుకొచ్చిన తాను చేతికి అందిన కాంగ్రెస్ జెండాను పట్టుకొని మహా ప్రదర్శనలో భాగమైనట్లు శంకరయ్య నాటి ఘటనను పేర్కొన్నారు.
విప్లవం అంటే తుపాకులు, బాంబులు కావు
– భగత్‌సింగ్
(ఈ రోజు భగత్‌సింగ్ వర్థంతి)
సమతావాది, స్వాతంత్రవీరుడు, షహీద్ భగత్‌సింగ్ దేశంకోసం ప్రాణాలిచ్చిన త్యాగశీలి మాత్రమే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. ఆయనతో పాటు ఆయన సహచరులైన సుఖదేవ్, రాజ్‌గురులను ఆనాటి బ్రిటిష్ పాలకులు మార్చి 23, 1931 ఉరితీసి చంపేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెల్లవారుజామున కాకుండా ముందురోజు సాయంకాలం, జైలు సాంప్రదాయానికి విరుద్ధంగా లహోర్ జైల్లో ఉరితీశారు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఏమార్చి గుట్టుచప్పుడు కాకుండా ఉరితీస్తే ఏ గొడవా ఉండదని బ్రిటిష్ ప్రభుత్వం తప్పుడు అంచనా వేసింది.
భగత్‌సింగ్‌కు కీర్తి ప్రతిష్టలు కేవలం ప్రాణత్యాగం వల్ల లభించినవి కావు. ఆయన సల్పిన పోరాటాల వల్ల, చేసిన ప్రసంగాల వల్ల, పత్రికల్లో తాను రాసిన వ్యాసాల వల్ల లభించినవి. ఆయన నిజానికి యవ్వన దశ ఆరంభంలోనే చనిపోయారు. ఆ కొద్ది సమయంలో తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలను, గౌరవాదరాలను అర్జించారు. ఆయన స్వాతంత్య్ర యోధులైన త్యాగధనుల కుటుంబంలో పుట్టారు. ధైర్యసహసాలతో పాటు త్యాగశీలతను ఆ కుటుంబం బాల భగత్‌సింగ్‌కు ఉగ్గుపాలలో రంగరించి పట్టించిందేమో! కాలేజీ దశలో ఒక అధ్యాపకుడి ద్వారా మార్క్సిజానికి పరిచయమయ్యాడు. మార్క్సిస్టు సాహిత్యంతో పాటు ప్రపంచ ఉద్యమాలను, ఇంగ్లీషు హిందీ, ఉర్దూ సాహిత్యాలను అధ్యయనం చేశారు. క్రమం తప్పకుండా ఇంగ్లీషు, హిందీ, పంజాబీ పత్రికలకు ముఖ్యమైన రాజకీయ అంశాలపై వ్యాసాలు రాశారు. జైల్లో ఉండగా తన పూర్తి సమయాన్ని అధ్యయనానికి, వ్యాసరచనకు ఉపయోగించారు. మారుపేర్లతో ఆయన వ్యాసాలు ప్రచురితమయ్యేవి. జైల్లో కూడా బ్రిటిష్ పోలీసుల అమానవీయ ధోరణికి వ్యతిరేకంగా రాజకీయ ఖైదీలను సమీకరించి సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేసి కొన్ని డిమాండ్లు సాధించారు. పోలీసులు పెట్టే బాధలను భరించలేక నీరు కారిపోయే తన సహచరులకు ధైర్యం చెప్పి నిలబెట్టారు. తనతోపాటు ఉరిశిక్షకు గురైన సుఖదేవ్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తే బీరువులా మరణిస్తే లోకం హర్షించదు. ధైర్యంగా ఉరికంబం ఎక్కి ప్రాణాలను అర్పించిన వారినే అది గౌరవిస్తుందని, అలాంటి వారిని దేశం ఆరాధిస్తుందని వివరించి సుఖదేవ్ చేత ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాన్పించారు. భగత్‌సింగ్ క్షమాభిక్ష కోరుతూ లెటర్ పెట్టకోమని చెప్పిన తండ్రి మాటను నిరాకరించారు. ఆ పని తర్వాతి కాలంలో విడి సావర్కర్ చేశాడు. క్షమాభిక్ష కోరడంతో పాటు బ్రిటిష్ పాలకుల షరతులను అంగీకరించి ఆచరించాడు.
భగత్‌సింగ్ లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో పుట్టారు. నాన్న కిషన్‌సింగ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినవాడు. చిన్నాన్న అజిత్‌సింగ్ బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగాడు. అతను రైతులను రెచ్చగొడుతున్నారని పోలీసు అరెస్ట్ చేస్తే తప్పించుకుని కెనడాకు వెళ్లారు. అక్కడి నుండి స్వాతంత్ర పోరాటానికి సహకరించారు. భగత్‌సింగ్ బాలుడిగా ఉన్న సమయంలో జలియన్‌వాలా బాగ్‌లో ప్రపంచం కనీవిని ఎరగని రీతిలో నిరాయుధులపై పిల్లలు, వద్దులు, మహిళలు అన్న విచక్షణ లేకుండా బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారు. వందల మందిని హతమార్చారు. ఇంట్లో చెప్పకుండా బాలభగత్ జలియన్‌వాలా బాగ్‌కు చేరుకొని అమరులకు నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమేసే దాకా పోరాడాలని తనకు తాను తీర్మానించుకొన్నారు. ఆ నిర్ణయానికి చివరిదాకా కట్టుబడ్డారు.
తన అధ్యాపకుడి సూచనపై కాన్పూర్‌కు వెళ్లి చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిశారు. విప్లవ చర్యల్లో పాల్గొన్నారు. విప్లవం అంటే తుపాకులు, బాంబుల సంస్కృతి కాదని అర్థం చేసుకొన్నాడు. తాను చేరిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పేరును హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోషియేషన్‌గా మార్చారు. తన మాతృదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విముక్తి చేస్తే సరిపోదని, స్వతంత్ర భారతదేశంలో సమసమాజాన్ని సాధించాలని ఆశించారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే సహచరులను ఢిల్లీ ఫిరోజ్ కోట శిధిలాల దగ్గర రహస్యంగా సమావేశ పరిచి సోషలిజం ఆవశ్యకతను అందరి చేత ఒప్పించి తన సంస్థ పేరులో సోషలిస్టు అన్న పదాన్ని చేర్చారు.
మతం కులం ప్రాంతం తదితర అస్తిత్వాల పేర ప్రజలను విభజించడానికి భగత్‌సింగ్ గట్టి వ్యతిరేకి. ఆయన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకొన్నారు. ఒక మనిషికి మరో మనిషికి పరాయి వాడుగా కనిపించని సమాజాన్ని ఆకాంక్షించారు. అంటరానితనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. 40 కోట్లు భారతీయుల్లో 6 కోట్ల మందిని అంటరానివారంటూ దూరంగా ఉంచడం దుర్మార్గమని చెప్పారు. మన దేశంలో సోదర భారతీయులను హీనంగా చూసే విదేశాల్లో మన ఇండియన్లను హీనంగా చూస్తున్నారని ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆనాటి స్వాతంత్ర పోరాట నాయకులైన మదన్మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయి గొప్ప నాయకులు ‘అంటరానివారి’తో బహిరంగ స్థలాల్లో పూలదండలు వేయించుకోవల్సివస్తే ఇంట్లోకి వెళ్ళకముందు బట్టలు విప్పకుండానే నెత్తిన బకెట్లతో నీటిని గుమ్మరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. స్వాతంత్రోద్యమంలోని ముస్లిం నాయకులు కూడా అదే పని చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
భగత్‌సింగ్ తాత ఆర్యసమాజం అనుచరుడు. మనవడి చేత బాల్యంలో ప్రార్థనలు చేయించేవాడు. అధ్యయనం, పరిశీలన వల్ల యుక్తవయస్సులోనే భగత్‌సింగ్ నాస్తికుడిగా మారారు. నాస్తికవాదాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాశారు. జైల్లో ఉండగా తనపై సానుభూతి గల పోలీసులు ఆయన్ని దైవప్రార్థనలు చేయమని కోరేవారు. ఆ సూచనలను ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. జైల్లోని దుర్భర పరిస్థితుల మధ్య దైవం అనే భావన సాంత్వన కల్పించే మాట నిజమే అయినా, అశాస్త్రీయమైన భావనకు తాను లొంగిపోవడం ఏమిటని తనను తాను ప్రశ్నించుకొన్నాడు. ఆయనలో ధైర్యం సడలలేదు. శాస్త్రీయ దక్పథం వైపే నిలబడ్డారు. దేశంలో అప్పుడప్పుడే పెరుగుతున్న మతోన్మాద ప్రమాదాన్ని ఆయన సరిగ్గా అంచనా వేశారు. మతం పట్ల అశాస్త్రీయ ఆలోచనల పట్ల కాంగ్రెస్ నాయకుల దృక్పథాన్ని ఆయన దునుమాడే వారు. ఆనాటి కాంగ్రెస్‌లో రెండు భిన్నమైన ఆలోచనగల నాయకులున్నారు. జవహార్ లాల్ నెహ్రు ఆధునికుడు, శాస్త్రీయవాది, అభ్యుదయగామి కాగా, సుభాష్ చంద్రబోస్ తిరోగమన వాది. దేశాన్ని తిరిగి వేదకాలం నాటికి తీసుకెళ్లాలని భావించేవారు అని విమర్శించారు. వీరు గాక స్వాతంత్య్రోదమం వెలుపల మరో ఆలోచనా స్రవంతి ఉంది. భారతదేశంలో హిందువుల పాలన నెలకొల్పాలన్న మతోన్మాద స్రవంతి అది. ప్రమాదకరమైంది. ఉత్తరోత్తర భారతదేశంలో వారు పరిపాలనలోకి రావచ్చు అని హెచ్చరించారు. భగత్‌సింగ్ ఎంతటి దూరదృష్టి గలవాడో దాన్ని బట్టి చెప్పొచ్చు.
భగత్‌సింగ్ కుటుంబం లాలాలజపతి రారుని పెద్దదిక్కుగా భావించేది. ఆయన మాటకు ఎదుర్లేదు. అలాంటి లాలా హిందుమహాసభకు అనుకూలంగా మారినప్పుడు భగత్‌సింగ్ సహించలేదు. ఆయనను ఘాటుగా విమర్శించారు. రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం జయప్రదమైనప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకుల్లో భయం పుట్టుకువచ్చింది. అలాంటి వారిలో లాలా ఒకరు. ఆయన భగత్‌సింగ్ ప్రమాదకరమైన బొల్షివిక్ బాటలో వెళ్తున్నాడని హెచ్చరించారు. తనకు భగత్‌సింగ్‌కు మధ్య పత్రికల ద్వారా సంవాదం జరిగేది. భగత్‌సింగ్ నన్ను లెనిన్‌లా మార్చాలనుకొంటున్నాడు కాని అది జరగని పని అని లాలా వ్యాఖ్యానించారు. భగత్ కూడా దానికి గట్టి సమాధానాలే చెప్పారు. సైమన్ కమిషన్ వెనక్కి వెళ్లిపోవాలని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. లాహోర్‌లో జరిగిన ప్రదర్శనకు లాలా నాయకత్వం వహించి ముందు వరుసలో నడిచారు. పోలీసులు ప్రదర్శకులపై విచక్షణ లేకుండా లాఠీచార్జి చేశారు. వృద్ధుడు పేరెన్నిక గల నాయకుడైన లాలా ను కూడా కొట్టారు. ఆయన తలకు బలమైన గాయాలు తగిలాయి. ఆ దెబ్బలకు చికిత్స పొందుతూ లాలా మరణించారు. లాలా మరణానికి ప్రతీకారం తీర్చుకొని బ్రిటిష్ పోలీసులకు బుద్ధిచెప్పాలని చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ మిగతా సహచరులు నిర్ణయించుకొన్నారు. ఒక ఆంగ్లేయ పోలీసు అధికారిని కాల్చి చంపారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులతో మరికొందరు సహచరులను అరెస్టు చేశారు. వారిలో భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురులకు బ్రిటిష్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈలోగా చంద్రశేఖర్ ఆజాద్ పై ఝాన్సీలో పోలీసులు కాల్పులు జరిపారు. బ్రిటిష్ బుల్లెట్‌తో మరణించిడం ఇష్టంలేని ఆజాద్ తన పిస్టల్లో మిగిలిన చివరి బులెట్‌తో తనను తాను కాల్చుకొని మరణించారు.
ఆ ఘటనకు ముందు బ్రిటిష్ పాలకులు కార్మిక వ్యతిరేక బిల్లులను ప్రవేశపెడ్తున్న సమయంలో విజటర్స్ గ్యాలరీలోంచి జాతీయ అసెంబ్లీలోకి పొగ బాంబులు విసిరారు. ఠారెత్తిన పోలీసులు తమను అరెస్టు చేసేదాకా గ్యాలరీలోనే నిలబడ్డారు. ‘తాము ఎవరినీ చంపాలని బాంబులు విసరలేదని బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికే ఆ పని చేశామని ప్రకటించారు. మేము ఎవరినైనా చంపాలనుకొంటే ప్రజాకటంకులైన బ్రిటిష్ అధికారులు ఆ సమయంలో సభలో ఉన్నారు. మేము వారి పైకి నేరుగా బాంబులు విసిరేవాళ్లం. అలా కాకుండా ఎవరూలేని ప్రదేశంలోకి బాంబులు విసిరాం. మేము విప్లవం కోరుకొంటున్నాం. సమ సమాజాన్ని అకాంక్షిస్తున్నాం అందుకే కార్మిక వ్యతిరేక బిల్లు ప్రవేశపెట్టే సమయాన్ని మా చర్యకు ఎంచుకొన్నాం. విప్లవం అంటే తుపాకులు, బాంబులు కాదు. విప్లవం అంటే మౌలికమార్పు. అలాంటి మార్పును కోరుకొంటున్నాం. కుల మతాలకు అతీతమైన ప్రభుత్వం కావాలనుకొంటున్నాం ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి నూతన సమాజాన్ని నిర్మించడం మా లక్ష్యం’ అని విస్పష్టంగా వారు కోర్టులో ప్రకటించారు. తద్వారా హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ లక్ష్యాలు ఏమిటో దేశం ముందుంచారు.
జైల్లో ఉండగా ఆయన విస్తృత అధ్యయనంతో పాటు మారు పేర్లతో పత్రికలకు వ్యాసాలు రాసి పంపడమే కాక తన దగ్గర 200 పేజీల నోట్‌బుక్ ఉంచుకొని ప్రముఖులు చెప్పిన ముఖ్యమైన విషయాలను ఆ నోట్‌బుక్‌లో రాసుకొన్నారు. మొదట్లో టెర్రరిస్టు కార్యకలాపాలవైపు మొగ్గినా త్వరలోనే ఆ పంథానుండి వెనక్కి వచ్చారు. నూతన సమాజ నిర్మాణంకోసం కార్మికుల్ని, రైతులను విశాల ప్రజానీకాన్ని సమీకరించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకొన్నారు. మొదటి నుండి కూడా భగత్‌సింగ్ విశ్వమానవ సాభ్రాతృత్వాన్ని కోరుకొన్నారు. 1924లో ఆయన ఆ విషయంపై ఒక వివరమైన వ్యాసం రాశారు. అప్పటికి ఆయన వయస్సు 17 ఏళ్లు మాత్రమే. కాంగ్రెస్ నాయకత్వం మతాతీతంగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉండేది. నలుపు – తెలుపు, నాగరికులు – అనాగరికులు, పాలకులు – పాలితులు, ధనికులు – పేదలు, సవర్ణలు – అంటరాని వాళ్లు అన్న పదాలు ఉనికిలో లేని సమాజాన్ని ఆయన కోరుకొన్నారు.
ఆనాటి పత్రికలను, పాత్రికేయులను కూడా ఆయన దుయ్యబట్టారు. పత్రికలు ప్రజల ఆలోచనల్లోని కల్మషాన్ని కడిగేయ్యాలి. అది వదిలేసి అజ్ఞానాన్ని, ఒంటెత్తుతనాన్ని మతతత్వ దురభిమానాలను పత్రికలు పెంచుతున్నాయి. భారతదేశపు సమ్మిళిత సంస్కృతిని, ఉమ్మడి వారసత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఘాటుగా పత్రికలను ఏకిపారేశారు. భగత్‌సింగ్ ఆయన సహచరులు 1926లో నౌజవాన్ భారత్ సభ అనే సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ అనుసరించాల్సిన నిర్ధిష్ట ప్రణాళికను భగత్‌సింగ్ రాశారు. ఆ ప్రణాళికలో ‘మతపర మూఢాచారాలు, మతోన్మాదం మనకు అడ్డుగోడలుగా నిలిచాయి. మనం ఆ భావనలను వదిలెయ్యాలి. స్వేచ్ఛాయుత ఆలోచనకు అడ్డుపడేదల్లా నశించాల్సిందే’ అని విస్పష్టంగా ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. భగత్‌సింగ్‌పై వచ్చిన సినిమాలు పుస్తకాలు పూర్తిగా ఆయన ఆలోచనలను మన ముందు ఉంచవు. ఆయన రాసిన వ్యాసాల ద్వారా మాత్రమే భగత్‌సింగ్‌ను అర్థం చేసుకోగలం, కనుక నేటి యువతరం భగత్‌సింగ్ రచనలను తాముగా చదివి ఆయన ఆలోచనలను, అంకుఠిత త్యాగాన్ని అర్థం చేసుకోవాలి.
– ఎస్. వినయ కుమార్ ,
99897 18311