ప్రసారమాధ్యమాల్లో తనదైన వాణి …

ప్రసారమాధ్యమాల్లో తనదైన వాణి ...ఇంటర్నెట్‌, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సష్టించింది. స్వాతంత్ర పోరాటంలో, ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్‌, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. ఓ రెండు దశాబ్దాల కిందటి వరకు పెద్దా చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. గతంలో డా||బాలాంత్రపు రజనీకాంతరావు వంటి సంగీత ప్రయోక్తలు రేడియో ద్వారా తెలుగులో మంచి కవితలకి సంగీతం కట్టి ప్రజలకు వినిపించారు.
కారు ప్రయాణంలో మనకు తోడుగా పాటలు వినిపించటానికి ముందు.. విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు, ట్రక్‌ డ్రైవర్లు, పోలీసులు, అత్యవసర సేవలు, ఇంకా ఎన్నో రంగాల్లో సమాచార సంబంధాలకు, దారిచూపటానికి ప్రధాన మార్గంగా మారిపోయింది రేడియో. ప్రపంచ సమాచార సంబంధాలను విప్లవాత్మకంగా మలచింది.
రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, రోడ్డుపక్క నిప్పులకొలిమిలో పనిచేసే కార్మికులు… వీరూ వారు అని లేకుండా ప్రతీఒక్కరికీ చేరువైన విజ్ఞాన వినోద సాధనం రేడియో అంటే అతిశయోక్తిలేదు. అక్షరాస్యత లేని వారు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా వార్తా ప్రసారాలను అందించేది. అయితే ప్రసార మాధ్యమాలలో కీలక భూమిక పోషించే రేడియోను వినియోగించుకునే అవకాశం మొదట్లో అందరికీ ఉండేదికాదు. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన వారే రేడియోను కొనుగోలు చేసుకునేవారు.
ప్రపంచవ్యాప్తంగా రేడియో దినోత్సవం జరుపుకోవాలని 1910లో ప్రయత్నాలు జరిగినా ఆ ప్రక్రియ ప్రారంభం కావడానికి చాలాకాలం పట్టింది. 1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్‌ కాన్ఫరెన్స్‌ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.
రేడియో – ట్రాన్సిస్టర్‌:
కాంతి వేగ పౌనఃపున్యాలతో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌ చేయటం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్లు వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్‌సిస్టర్‌ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, బ్యాటరీతో కూడా పనిచేసే విజ్ఞానమూ పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈ ట్రాన్సిస్టర్‌ సాంకేతిక నైపుణ్యమూ అభివద్ధి చెంది, చిన్నపెట్టె అంత రేడియో కేవలం జేబులో ఇమిడే పెన్ను పరిమాణానికి వచ్చేసింది.
అమెరికాలోని బెల్‌టెలిఫోన్‌ ప్రయోగశాలలో పని చేసే పరిశోధక బందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చ్‌లైట్‌లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్‌ కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో రేడియో వినియోగం ప్రజలకు మరింత దగ్గరయింది. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్‌ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది.
జూన్‌ 2, 1896వ సంవత్సరంలో ఇటలీకి చెందిన మార్కోని అనే శాస్తవ్రేత్త రేడియోను కనిపెట్టాడు. కానీ, మే 7, 1896న రష్యాకు చెందిన శాస్తవ్రేత్త అలెగ్జాం డర్‌ పోప్‌ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ పద్ధతిని కనుగొన్నాడని కొందరంటారు. ప్రపంచంలో రేడియో ప్రసారాలు 1921లో ప్రారంభమ య్యాయి. విద్యుత్‌ రేడియో తరంగాలు సెకండ్‌కు లక్షా 86 వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తాయి. ఎర్‌జ్టి అనే జర్మన్‌ శాస్తవ్రేత్త విద్యుత్‌ నుండి అయస్కాంత తరంగాలు.. వెలుతురు నుండి వచ్చే తరంగాల వలెనే అన్ని వైపులకూ ప్రసరిస్తాయని చెప్పాడు. ఈ సూత్రమే రేడియోను కనుగొనడానికి దారితీసింది. భారత్‌లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ 1924లోనే మద్రాసులో రేడియో క్లబ్‌ ఒకటి స్థాపించడంతో ప్రారంభమైంది. కొద్దికాలం లోనే ఇది మూతపడింది. తిరిగి 1932 నుండి ప్రభుత్వమే రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ను నిర్వహిస్తోంది.
1860లో మార్కోనీ తయారు చేసిన రేడియోకు ఒకే బ్యాండ్‌ ఉండేది. దాన్ని ‘లాంగ్‌ వే’ అనేవారు. అనంతరం మీడియం వే, షార్ట్‌ వే.. ఇలా బ్యాండ్‌లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం సింగిల్‌, షార్టు వేపై 1 నుండి 3 వరకు, మీడియం వేపై 1200 వరకు బ్యాండ్‌లు వస్తున్నాయి.
రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా పనిచేస్తుంది
రేడియో ఫ్రీక్వెన్సీని హెర్ట్‌జ్‌ (నఓ) అని పిలిచే యూనిట్లలో కొలుస్తారు. రేడియో తరంగాలు సెకనుకు వేల (కిలోహెర్ట్‌జ్‌) నుండి మిలియన్ల (మెగాహెర్ట్‌జ్‌) నుండి బిలియన్ల (గిగాహెర్ట్‌జ్‌) చక్రాల వరకు ఉంటాయి. రేడియో తరంగంలో, తరంగదైర్ఘ్యం ఫ్రీక్వెన్సీకి విలోమానుపాతంలో ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీలు మానవ కంటికి కనిపించవు. =ఖీ స్పెక్ట్రమ్‌ కంటే ఫ్రీక్వెన్సీ పెరిగినందున, విద్యుదయస్కాంత శక్తి మైక్రోవేవ్‌లు, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ , కనిపించే, అతినీల లోహిత, శ- కిరణాలు మరియు గామా కిరణాల రూపాన్ని తీసుకుంటుంది.
ఇప్పుడంటే – లైవ్‌ టీవీ ఛానెల్స్‌ పత్రికలూ, ఇంటర్నెట్‌ మనల్ని 24 గంటలూ సమాచార ప్రవాహంలో ముంచి తేలుస్తున్నాయి. కానీ – అనేక దశాబ్దాలుగా వార్తల్ని కొండకోనల్లో ఉన్నవారికి సైతం చేర్చే మాధ్యమం ఆకాశవాణి. న్యూస్‌రీడర్లకు, ఎనౌన్సర్లకు ఆ రోజుల్లో సినీతారల్లా పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే వ్యాఖ్యాతలు ఉండేవారు.
కర్షకుల కార్యక్రమానికి కొత్తపుంతలు తొక్కించిన ఖ్యాతి చిన్నక్క (రత్నప్రసాద్‌) ఏకాంబరం (వి.సత్యనారాయణ)లకు దక్కుతుంది. సాహిత్యానికి సంబంధించి ఎన్నో వైవిధ్యభరిత కార్యక్రమాలను ప్రసారం చేసిన ఘనత ఆకాశవాణిది. బాలానందం, బాలవినోదం కార్యక్రమాలు పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకున్నాయి. ‘రేడియో అక్కయ్య, అన్నయ్య’లుగా కామేశ్వరి, రాఘవరావు ప్రసిద్ధులు. లలిత సంగీతం అన్న పేరు ప్రాచుర్యం పొందింది ఆకాశవాణితోనే.
ఉషశ్రీగా చిరపరిచితులైన పురాణపండ సూర్యప్రకాశదీక్షితుల పురాణ శ్రవణం రేడియోను ఉత్తుంగ శిఖరం పై నిలబెట్టింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన వ్యాఖ్యానం వినటానికి శ్రోతలు రేడియో చుట్టూ చేరి పోయేవారు. మహాకవి శ్రీశ్రీ, సీనియర్‌ నటుడు జగ్గయ్య ఒకప్పుడు వార్తలు చదివిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. పి.సుశీల గాత్రాన్ని రేడియోలో వినే పెండ్యాల సినిమాలో అవకాశం ఇచ్చారు.
కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, వనమాలి ప్రసాద్‌, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్‌, పి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయశాస్త్రి, సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, డి.వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకష్ణ తదితరులు వార్తలు వినిపించడంలో సుప్రసిద్ధులు. పన్యాల రంగనాథరావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకష్ణారావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకష్ణారావు, మల్లాది రామారావు, ఆర్‌.వి.వి.కష్ణారావు, జె.బి.రాజు, కె.ఆసయ్య ఇంకా ఎందరో మహానుభావులు. ఈ పేర్లు ఎవరివో తెలుగువారికి పరిచయం చేయనవసరంలేదు. రేడియో ప్రియులందరికీ చిరపరిచితమే.
ప్రసంగాలు, గోష్ఠులు, సంచికా కార్యక్రమాలు కవిసమ్మేళనాలు, అష్టావధానాలు, సమస్యా పూరణాలు, ధర్మసందేహాలు, భద్రాచల సీతారామ కళ్యాణం, తిరుపతి బ్రహ్మోత్సవాలు, శ్రీశైల శివరాత్రి ఉత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వంటి కార్యక్రమాలతో శ్రోతలను అలరించాయి. హైదారాబాద్‌ కేంద్రం నవలా స్రవంతి పేరిట తెలుగు నవలలను ఎన్నింటినో వినిపించింది. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ విజయవాడ కేంద్రం నుంచి బద్దన్న సేనాని నవలను తానే స్వయంగా చదివి వినిపించారు.
‘ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది…’ అనగానే అక్కడ రేడియో స్టేషన్లో ఆ వార్తల్ని చదవబోయేది ఎవరో శ్రోతలు ఇట్టే పసిగట్టేసేవారు. ”నిలయంలో సమయం” అని చెప్పగానే ఇంట్లో గడియారాల్లో టైముని సరిచేసుకునేవాళ్ళు కోకోల్లలు. గాంభీర్యం, స్పష్టత, మాధుర్యం… అన్నీ కలగలిసినట్టు ఉండే ఆ గొంతులోని మాటలు శ్రోతల్ని కట్టిపడేసేవి. స్వతంత్రం, మహాత్ముని హత్య, నెహ్రూ మరణం, ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ హత్య… ఇలాంటి ఎన్నో వార్తలు ప్రజలకు తెలిసింది రేడియో ద్వారానే.
మావోయిస్టుల సానుభూతిపరులతో ప్రభుత్వం చర్చలు జరిపినపుడు ఆ సమాచారం అడవుల్లోని మావోయిస్టులకు చేర్చే మాధ్యమం రేడియోనే. ప్రభుత్వ సంస్థ అయినా కూడా ఆకాశవాణి మీదున్న విశ్వాసంతో వారు ఈ వార్తలపై ఆధారపడేవారు. ఉద్యోగార్ధులూ సమాచారానికి రేడియోనే ఆశ్రయించేవారు.
ఆకాశవాణిలో సాధారణ వార్తల ప్రసారం ఒక ఎత్త్తెతే ఎన్నికలూ, తుపానులూ, ఆందోళనల సమాచారం అందించడం మరో ఎత్తు. ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఫలితాలు వచ్చేంత వరకూ రేడియో చెవికి అతుక్కుపోవడమే. క్రికెట్‌ కామెంటరీ వస్తోన్నా అదే పరిస్థితి. సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారూ, రైతులూ (ఇప్పటికీ) ఆకాశవాణి తాజా వాతావరణ సమాచారం మీదే ఆధారపడతారు. విద్యుత్తు లేనపుడు వార్తల్ని ట్రాన్సిస్టర్‌లో వినే పల్లెవాసులు ఎంతో మంది ఉన్నారు. ట్రాన్సిస్టర్‌ వచ్చాక ప్రైవేటు టీవీ ఛానెళ్లు రాక ముందు 1995 నాటికి ఆకాశవాణి అత్యున్నత ప్రజాదరణను పొందింది.
20నవంబర్‌ అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్‌ ఎన్నికయ్యారు అన్న వార్త మొదట పిట్స్‌బర్గ్‌ కేంద్రం నుండి ప్రసారం అయింది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనబరచిన తొలి యూరోపియన్‌ దేశం ఇంగ్లాండ్‌ అయినా ప్రభుత్వ ఆంక్షల వల్ల కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. దాదాపు ఆరు కంపెనీలు కలిసి 1922 లో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ బిబిసి స్థాపించాయి. నవంబర్‌ 14 నుండి లండన్‌ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లల్లో 1950లో భారత ప్రభుత్వం డెక్కన్‌ రేడియో స్టేషన్‌ నిజాం నుంచి స్వాధీనం చేసుకుని ఆల్‌ ఇండియా రేడియో ఆకాశవాణి పరిధిలోనికి తెచ్చింది. విశాఖపట్నం, కడపలో 1963లో ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌లు ప్రారంభమయ్యాయి.
కాలంతోపాటు ఆకాశవాణి కూడా మారుతోంది. ఈ సంస్థ వార్తా విభాగం వెబ్‌సైట్లో newsonlineair.co.i ఏపూట కాపూట వివిధ భాషల్లోని వార్తా బులెటిన్లూ, స్క్రిప్టులను పెడుతోంది. అక్కడ తెలుగు వార్తలు వినొచ్చు, చదవొచ్చు. ఫోన్‌, ఎస్సెమ్మెస్‌ల ద్వారా న్యూస్‌ అప్‌డేట్స్‌ అందించే సౌకర్యమూ ఉంది. ప్రైవేటు రేడియో సంస్థలకు వార్తలు అందించే హక్కును ప్రభుత్వం ఇంకా కల్పించలేదు. ఎఫ్‌.ఎమ్‌. వాళ్లు ఆకాశవాణి వార్తల్ని యథాతథంగా ప్రసారం చేసే అవకాశం మాత్రం ఉంది.
FM రేడియో:FM (Frequency Modulation) రేడియో చానెల్స్‌కు పరిమిత ప్రాంత ప్రజల అభిరుచులు, సంస్కతి ముఖ్యం. అనేక ప్రైవేట్‌ సంస్థలు దేశవ్యాప్తంగాFM రేడియో ఛానెళ్లను ప్రారంభించాయి. ఆకాశవాణి వివిధ భారతి FM లను కూడా ప్రారంభించింది. ఖీవీ ఛానెల్‌ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ.
భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్‌ FM రేడియో స్టేషన్‌ – రేడియో సిటీ బెంగళూరు (2001 జూలై 3న ప్రారంభమైంది)
దూరదర్శన్‌ Television) సేవలను 1976 ఏప్రిల్‌ 1లో రేడియో నుంచి విడదీసారు. (1959 సెప్టంబరు 15 న టెలివిజన్‌ సేవలు ఒక చిన్న ట్రాన్స్‌మీటర్‌ తో మొదలైనాయి)
రేడియో ప్రస్థానంలో మైలు రాళ్ళు
న్యూయార్క్‌ నగరంలో ఉన్న మెట్రోపాలిటన్‌ ఒపెరా హౌస్‌లో జరిగిన ప్రదర్శనను 1910 జనవరి 13న లీ డి ఫారెస్ట్‌ (Lee de Forest) రేడియో టెలిఫోన్‌ కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ రేడియో ప్రసారం. సంగీతాన్ని ఈ విధంగా ప్రసారం చేయవచ్చు, కచేరీ హాళ్ళ వెలుపల వినవచ్చు అనే ఆలోచన ఆ సమయంలో ప్రజలకు పూర్తిగా కొత్త. వేదిక నుండి వచ్చే గానం చాలా వరకు శ్రోతలకు సరిగ్గా వినిపించలేదు. కాని ఈ ప్రయోగం భవిష్యత్‌ పబ్లిక్‌ రేడియో ప్రసారాలకు మార్గం సుగమం చేసింది అని చెప్పవచ్చు.
ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్‌ 16న ప్రారంభమయ్యాయి. సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామి రచించిన ‘శ్రీ గణపతిని సేవింపరాదే ‘అనే తెలుగు కతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్యపిళ్లై నాదస్వరంపై వాయిస్తూండగా తొలి ప్రసారం మద్రాసు కేంద్రం ప్రారంభమైంది.
ఆలిండియా రేడియో
మన దేశంలో రేడియో ప్రసారాలు 1923 జూన్‌ లో రేడియో క్లబ్‌, క్లబ్‌ ఆఫ్‌ బొంబారు ద్వారా తొలిసారిగా ప్రసారమయ్యాయి. 1927లో బొంబాయిలోనే ‘ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌’ పేరుతో తొలి రేడియో స్టేషన్‌ ప్రారంభ మయ్యింది. 1936లో ఆలిండియా రేడియోగా మార్చారు. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కు వగా ఉర్దూలో ఉండేవి. దీనికి 1939లో దక్కన్‌ రేడియోగా పేరు మార్చారు. ప్రసారాలు ఉర్దూలో ఉండే కాలంలో మాడపాటి హనుమంతరావు తదితరుల కషితో తెలుగులో కూడా రేడియో కార్యక్రమాలు ప్రసారమైనాయి.
1935లో మైసూరు సంస్థానం వారి ప్రైవేటు రేడియో కార్యక్రమాలు ఆకాశవాణి పేరుతో మొదలయ్యాయి. 1956లో ఆలిండియా రేడియోతోపాటు ఆకాశవాణి పేరును అధికారికంగా స్వీకరించారు. ఇది ఐచ్ఛికమే. ఇప్పటికీ హిందీ వ్యతిరేక రాష్ట్రమైన తమిళనాడులోని అన్ని కేంద్రాల్లో ఆలిండియా రేడియో అనే పిలుస్తున్నారు. ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్‌16న మద్రాసు నుంచి ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం నాటికి ఆరు రేడియో కేంద్రాలతో 11% దేశ జనాభాకే ప్రసారాలు అందగా నేడు 480 కేంద్రాలతో 99% జనాభాకు చేరుతున్నాయి.
1977 నుంచి ఎఫ్‌ఎం ప్రసారాలు ప్రారంభం కావడం ఆకాశవాణి చరిత్రలో ముఖ్యమైన మలుపు. 1990లో ప్రసారభారతి బిల్లుకు ఆమోదం లభించాక 1993 నుంచే వినోదం ప్రధానంగా, ప్రైవేటు రేడియో కేంద్రాల స్థాపనకు ప్రభుత్వమే ఆహ్వానించడంతో, 2001లో తొలి ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో సిటీ బెంగళూరు కేంద్రం తన ప్రసారాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 107 నగరాల్లో 371 ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియోల రాకతో ఆకాశవాణి ప్రభ క్రమంగా మసకబారసాగింది. తమ మేధస్సుతో ఎందరో ఉన్నతాధికారులు, కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వాహకులు ఆకాశవాణిని ఉన్నత శిఖరాలకు చేర్చారు.
1950-90 వరకు ఆకాశవాణిది స్వర్ణయుగం అని చెప్తారు. ఈ కాలంలో యావత్భారత జనజీవనాన్ని రేడియో అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కతి సంప్రదాయాలను నిలుపడంలో ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. మత ప్రసక్తి లేకుండా ఏ పండుగ వచ్చినా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసింది.
ప్రారంభం నుండి ఇప్పటి వరకు అకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చలు, గోష్టులు, పరిచయాలు, ఇంటర్వ్యూలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, గ్రామస్థులకు, స్త్రీలకు, పిల్లలకూ, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకూ, రచయితలకూ – అంతేకాకుండా నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరుకోరిన సినిమా పాటలు, శబ్దచిత్రాలు, సినిమా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతికపుణుల ఇంటర్వ్యూలు, పరిచయాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.
వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. మత కల్లోలాలు చెలరేగినపుడు, ప్రకతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆకాశవాణి క్రమంగా శ్రోతలకు దూరమైపోవడం ఓ విషాదం. ప్రైవేటు రేడియోల శైలిని ఆకాశవాణి అనుకరించటం శ్రోతలకు నచ్చడం లేదు.
‘మన్కీ బాత్‌’ పేరుతో ప్రధాని మోదీ ఉపయోగించుకున్నంతగా ఏ ప్రధానీ రేడియోను ఉపయోగించుకోలేదు.
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారతీయులను ఏకసూత్రంతో అనుసంధానించే శబ్దవేది ఆకాశవాణి.
రేడియో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ప్రసార భారతి ఆడియన్స్‌ రీసెర్చ్‌ బందం ద్వారా శ్రోతల సంఖ్యను లెక్కించడం జరిగింది. చీవషరఉఅAఱతీ యాప్‌లో ఆల్‌ ఇండియా రేడియో లైవ్‌ స్ట్రీమ్‌ల శ్రోతల సంఖ్య ఒక నెల వ్యవధిలో 2 మిలియన్లకు పెరిగింది. డిసెంబర్‌ 2021లో దాదాపు 18 మిలియన్ల మంది శ్రోతలు చీవషరఉఅAఱతీ యాప్‌ను ట్యూన్‌ చేసారు. నవంబర్‌లో వారి సంఖ్య 16 మిలియన్లు.

సిగేచర్‌ ట్యూన్‌
రంగస్థలం సినిమాలో జగపతిబాబు రాకని తెలియజేసే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ రేడియోలో వస్తూ ఉంటుంది. సినిమా చూసిన ప్రతీఒక్కరికీ ఇది పరిచయమే. రేడియోకి ప్రతీక ఆ సిగేచర్‌ ట్యూన్‌. శివరంజిని రాగం ఆధారంగా రూపొందించబడింది. చెక్‌ శరణార్థి ‘వాల్టర్‌ కౌఫ్‌మాన్‌’ చే స్వరపరచబడింది. వాల్టర్‌ 1934లో ఫ్రాంజ్‌ కాఫ్కా మేనకోడలు గెర్ట్రూడ్‌ హెర్మాన్‌ను వివాహం చేసుకున్నాడు. కుటుంబం 1934లో నాజీ జర్మనీకి పారిపోయింది. అతను భారతదేశానికి వచ్చి 1937 నుండి 1946 వరకు బొంబాయిలోని ఆల్‌ ఇండియా రేడియోలో సంగీత దర్శకుడిగా పనిచేశాడు. బాంబే ఛాంబర్‌ మ్యూజిక్‌ సొసైటీని స్థాపించాడు. 1936లో ఆల్‌ ఇండియా రేడియో కోసం సిగేచర్‌ ట్యూన్‌ను కంపోజ్‌ చేశాడు. జుబిన్‌ మెహతా భారతదేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ పాశ్చాత్య సంగీత కండక్టర్లలో ఒకరు. అతని తండ్రి మెహలీ మెహతా సిగేచర్‌ ట్యూన్‌లో వయోలిన్‌ వాయించే వ్యక్తి అని అంటారు.
ఫాదర్‌ ఆఫ్‌ రేడియో
తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్‌ ఆవిష్కర్త లీ డి ఫారెస్ట్‌ . ‘రేడియో పితామహుడు’ (ఫాదర్‌ ఆఫ్‌ రేడియో) అనే పేరు పొందాడు. చలనచిత్రాల తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి వార్నర్‌ సోదరులు ఓ సంచలనాత్మక విజయం సాధించగా, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ‘ఫోనో ఫిల్మ్‌’ ప్రక్రియను లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. 1904లో జాన్‌ ఆంబ్రోస్‌ ఫ్లెమింగ్‌ మొదటి రేడియో ట్యూబ్‌, డయోడ్‌ను కనిపెట్టగా, 1906లో రాబర్ట్‌ వాన్‌ లీబెన్‌, లీ డి ఫారెస్ట్‌ స్వతంత్రంగా ట్రయోడ్‌ యాంప్లిఫైయర్‌ ట్యూబ్‌ను అభివద్ధి చేశారు. 1907లో లీ డి ఫారెస్ట్‌ వాక్యూమ్‌ ట్యూబ్‌ (శూన్య నాళిక)ను కనిపెట్టడంతో ఎలక్ట్రానిక్స్‌ ప్రారంభమైనట్లు చెప్పబడుతుంది. తరువాత 10 ఏళ్ల కాలంలోనే, ఆయన కనిపెట్టిన పరికరాన్ని రేడియో ట్రాన్స్‌మిటర్‌లు, రిసీవర్‌లలో ఉపయోగించారు. అంతేకాకుండా సుదూర టెలిఫోన్‌ కాల్‌లకు కూడా దీనిని ఉపయోగించారు.
రేడియో లైసెన్స్‌
రేడియో లైసెన్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా! రేడియో వినాలన్నా పన్ను కొనాలన్నా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రేడియో కొన్నవారు రూ.15 చెల్లించి లైసెన్సు తీసుకునేవారు. అది క్రమంగా రూ.50కి పెరిగింది. లైసెన్సు ఏడాది గడువు ముగిశాక రెన్యువల్‌ చేసుకోవాల్సిందే. లైసెన్సు లేకుండా రేడియో వింటున్నామన్న సంగతి వైర్లెస్‌ ఇన్‌స్పెక్టర్‌కు తెలిసిందో రేడియోను జప్తు చేసేవారు. రూ.50 జరిమానా చెల్లిస్తేనే రేడియోను తిరిగి ఇచ్చేవారు. 150 ఏళ్ల క్రితం తయారైన రేడియోలు కొంతమంది దగ్గర ఇప్పటికీ పని చేస్తుండటం విశేషం.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834

Spread the love