భగత్‌ సింగ్‌ త్యాగాన్ని నేటి తరం యాది చేసుకోవాలి

– ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ: టీపీటీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ ‘యాది సభ’
నవతెలంగాణ-హైదరాబాద్‌
దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ చేసిన ప్రాణ త్యాగాలను నేటితరం యాది చేసుకొని, వారు చూపిన బాటలో నడవాలని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. తెలంగాణ ప్రయివేటు టీచర్స్‌ లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘భగత్‌ సింగ్‌ యాది సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుద్దాల అశోక్‌ తేజ, విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు టి.రమేష్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏ.విజరు కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. భగత్‌ సింగ్‌ స్పష్టమైన విజన్‌ కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడని తెలిపారు. టీపీటీఎల్‌ఎఫ్‌ బాధ్యత తీసుకొని యువత సన్మార్గంలో నడిచేలా కార్యక్రమాలు చేయాలని కోరారు. విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు టి.రమేష్‌ మాట్లాడుతూ.. మతం, రాజకీయాలు వేరని, పరిపాలనలో మతం జోక్యం ఉండదని బలంగా నమ్మినవారు భగత్‌ సింగ్‌ అన్నారు. టీచర్స్‌ చైతన్యమైతే భవిష్యత్‌ తరాలకు సమాజంలో ఒక బాధ్యత బాట చూపుతారని, అందువల్లే ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. టీపీటీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వివిధ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్‌, కవిత్వం తదితర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఈ సందర్భంగా వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ భవాని, శారద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటరమణ, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు సైదులు, విజయకుమార్‌, పుట్టపాక విజరు, స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love