జూన్‌ 30 లోగా కనీసం ఆరు గనులు వేలం వేయండి..!

జూన్‌ 30 లోగా కనీసం ఆరు గనులు వేలం వేయండి..!– లేకపోతే మేమే వేస్తాం
– తెలంగాణ సర్కార్‌కు కేంద్రం లేఖ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులను వేలం వేయాలని తెలంగాణ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. గడిచిన తొమ్మిదేండ్లలో కనీసం ఒక్క మినరల్‌ బ్లాక్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కేంద్ర గనులు శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో సుదీర్ఘ కాలంగా తెలంగాణలోని మైనింగ్‌ బ్లాక్‌లు వేలానికి నోచుకోకపోవడం, అందుకు గల అడ్డంకులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గుర్తు చేస్తూ లేఖలు రాసినా స్పందించలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రానికి లేఖ రాసినట్లు సమాచారం. మొత్తం 11 బ్లాక్‌ల జియాలాజికల్‌ రిపోర్ట్‌లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖని అందజేసింది. ఇందులో బ్లాక్‌లలో ఐదు ఐరన్‌ ఓర్‌ మైన్స్‌, ఐదు లైమ్‌ స్టోన్‌ (సున్నపు రాయి), ఒక మాంగనీస్‌ బ్లాక్‌లు ఉన్నాయి. ఈ 11 బ్లాక్‌ల్లో కనీసం 6 బ్లాక్‌లను ఈ నెల చివరి నాటికి వేలం వేయాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోతే, ఈ వేలం ప్రక్రియను కేంద్రం చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది. సవరించిన మైనింగ్‌ రూల్స్‌ 2021 ప్రకారం, గనులను నిర్ణీత సమయంలో వేలం వేయడంలో విఫలమైతే, ఆ బ్లాకులను విక్రయించే అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పింది. మైనింగ్‌ యాక్ట్‌ (వేలం విధానం) అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 354 ప్రధానమైన ఖనిజ బ్లాకులను వేలం వేశారు. ఇందులో 48 మినరల్‌ బ్లాక్‌లలో ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ వేలం ప్రక్రియతో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Spread the love