మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి బిగ్‌ షాక్‌

– మాల్‌ను సీజ్‌ చేస్తామని ప్రకటన
– హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆర్టీసీ ఉన్నతాధికారులు
నవతెలంగాణ-ఆర్మూర్‌
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపో పక్కన గల స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్‌ చేస్తామని అధికారులు తెలిపారు. గురువారం టీఎస్‌ ఆర్టీసీ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో మాల్‌ వద్ద నిర్వాహకులకు మైక్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, లీజు డబ్బులు చెల్లించాలని నెల రోజుల కిందటే లీజుదారుడు విశ్వజిత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. అయినా స్పందించకపోవడంతో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆర్టీసీ అధికారులు.. మాల్‌ను సీజ్‌ చేస్తామని దుకాణాదారులను హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్‌ను సీజ్‌ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థకు లీజుదారుడు రూ.3 కోట్లా 14లక్షల బకాయి ఉన్నట్టు తెలిపారు. బకాయిలు చెల్లించడానికి దుకాణ యజమానుల విజ్ఞప్తి మేరకు గురువారం సాయంత్రం వరకు గడువు ఇస్తూ నోటీసు అందజేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మాల్‌ సీజ్‌ అంశం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక అధికారులలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం.శంకర్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆంజనేయులు, డిపో సూపర్‌వైజర్‌ తదితరులున్నారు.

Spread the love