నవతెలంగాణ – హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి రాజమౌళి స్వయంగా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న రాజమౌళి, ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఈ విషయాలు వెల్లడించారు. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, వారణాసిలో జరగాల్సిన ముఖ్యమైన షెడ్యూల్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం కథను ముందుకు నడిపే చిన్న చిన్న సన్నివేశాలను, ప్యాచ్ వర్క్‌ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని జక్కన్న వివరించారు. ఆయన మాటలతో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు స్పష్టమైంది.



