ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుస్తు, జమిలి ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలందరికీ విప్‌లు జారీ చేశాయి. కీలకమైన అంశాలు, బిల్లులు చర్చకు రాబోతున్నందున ప్రతి ఎంపీ హాజరుకావాలని రెండు పార్టీలు కోరాయి. ఈ సమావేశాల ఎజెండాను రాజ్యసభ, లోక్‌సభ బులిటెన్ల ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో ఈ విప్‌లు జారీ చేశాయి. కాగా, మొదటిరోజు సమావేశంలో పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు బీజేపీ తమ విప్‌లో తెలిపింది. ఈ సమావేశాల్లో కీలకమైన ఐదు బిల్లులు ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2003, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, ఎన్నికల కమిషనర్ బిల్లు ఉన్నాయి. ఎజెండాలో వెల్లడించని అంశాలను కూడా బీజేపీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 22వ తేదీ వరకూ ఎంపీలంతా తప్పని సరిగా హాజరై, పార్టీ వైఖరికి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తమ విప్‌లో స్పష్టం చేసింది.

Spread the love